Sakshi News home page

Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌కు ‘వైల్డ్‌’ ఎంట్రీ

Published Sat, Nov 6 2021 4:46 AM

Amrabad Tiger Reserve Stating Safari Packages Soon For Tourists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో వైల్డ్‌లైఫ్‌ టూరిజం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. టైగర్‌ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్‌ స్టడీ టూర్, ఆదివాసీ, గిరిపుత్రులతో మాట్లాడే అవకాశం తదితర అరుదైన అనుభవాలతో టూర్‌ అందుబాటులో రానుంది. ఏటీఆర్‌లోని ఫరాహబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ టైగర్‌ సఫారీకి సంబంధించి   https:// amrabadtigerreserve.com వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకునే ప్రక్రియ ఆది లేదా సోమవారాల్లో (7, 8 తేదీల్లో) ప్రారంభించనున్నారు. ఈ నెల 14 నుంచి ఈ వైల్డ్‌లైఫ్‌ టూరిజం ప్యాకేజీ టూర్‌ మొదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.


దట్టమైన అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం


తొలుత రోజుకు 12 మందితో ఒక్క ట్రిప్‌ మాత్రమే ఉంటుంది. తెలంగాణకు చెందిన యువ ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అమ్రాబాద్‌ ఎఫ్‌డీవో రోహిత్‌ గొప్పిడి ఆలోచనల నుంచి ఈ టైగర్‌ సఫారీ టూర్‌ కార్యరూపం దాల్చింది. వివరాలు ఆయన మాటల్లోనే...

టూరిజం ఇలా సాగుతుంది..: మొదటిరోజు మధ్యాహ్నం టూర్‌ మొదలవుతుంది. భోజనం చేశాక అటవీ పరిరక్షణ, పచ్చదనం కాపాడేందుకు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి లఘుచిత్రాల ద్వారా పర్యాటకులకు అవగాహన కల్పిస్తాం. అక్కడే నెలకొల్పిన ల్యాబ్, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్‌ సెంటర్‌ను చూపిస్తాం. టైగర్‌ రిజర్వ్‌ అంటే ఏమిటీ, పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత, అటవీశాఖ నిర్వహిస్తున్న విధుల గురించి తెలియజేస్తాం. ఆ తర్వాత అడవిలో ట్రెక్కింగ్‌ ఉంటుంది. సాయంత్రానికి తిరిగొచ్చాక రాత్రి పూట చుట్టూ చీకటి, చక్కటి ఆహ్లాదకరమైన అడవిలోనే ఏర్పాటు చేసిన కాటేజీల్లో టూరిస్ట్‌లు బస చేస్తారు.

మరుసటి ఉదయమే సఫారీకి తీసుకెళ్తారు. తిరిగొచ్చాక మధ్యాహ్నానికి ఈ టూర్‌ ముగుస్తుంది. ఆహార పదార్థాలు పక్కనే ఉన్న మృగవాణి రిసార్ట్స్‌ నుంచి ఆర్డర్‌పై తెప్పించాలని నిర్ణయించాం. కొంతకాలం గడిచాక స్థానిక చెంచులతోనే ఆహారం సిద్ధం చేయించాలనే ఆలోచనతో ఉన్నాం. స్థానిక చెంచు స్వయం సహాయక మహిళా బృందం ద్వారా భోజనం సిద్ధం చేయడం ద్వారా వారికీ ఉపాధి లభించేలా చూడాలని చూస్తున్నాం. 

ప్రత్యక్ష అనుభూతి పొందేలా.. 
శ్రీశైలం దేవస్థానానికి వెళ్తూ మధ్యలో ఇక్కడి అడవిలో ఆగి వెళ్తున్నారు. ఆ తరహా పర్యాటకులు కాకుండా అ డవికి సంబంధించిన ప్రత్యక్ష అనుభూతి పర్యాటకులకు లభించాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి అందా లు, అడవి ప్రత్యేకతలు అందరికీ తెలిసేలా చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ రూపొందించారు. 

ఇద్దరికి రూ.4,600, ఆరుగురికి రూ.9,600.. 
వైల్డ్‌లైఫ్‌ టూరిజం/సఫారీ ప్యాకేజీలో భాగంగా ఇద్దరికి రూ.4,600, ఆరుగురికి రూ,9,600గా ధరలు నిర్ణయించాం. అడవి కాబట్టి బేసిక్‌ సౌకర్యాలు, సదుపాయాలతో దీన్ని నడిపిస్తాం. అమ్రాబాద్‌కు పర్యాటకులు రావాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించాం. అందువల్ల ఒక ప్యాకేజీ టూర్, ట్రెక్కింగ్, సఫారీ, కాటేజీలో రాత్రి బస వంటి అన్ని కలిపి అనుభూతి ఏర్పడాలనేది మా భావన. 


ఆదివాసీలే టూరిస్ట్‌ గైడ్‌లు.. 
మొక్కుబడి టూరిజం ట్రిప్‌గా కాకుండా పర్యాటకులకు అడవికి వెళ్లొచ్చామనే అరుదైన అనుభూతి కలిగేలా ఈ ప్యాకేజీ రూపొందించాం. స్థానిక చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌ గైడ్‌లుగా శిక్షణ పొందుతున్నారు. పరిమిత సంఖ్యలోనే పర్యాటకులను అనుమతిస్తాం. 12 మంది నుంచి గరిష్టంగా 20, 25 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. 
– ఐఎఫ్‌ఎస్‌ అధికారి రోహిత్‌ గొప్పిడి  
 

Advertisement

What’s your opinion

Advertisement