పోలీసులు X గిరిజనులు | Sakshi
Sakshi News home page

పోలీసులు X గిరిజనులు

Published Mon, Apr 1 2024 1:49 AM

Argument between tribal groups over Podu - Sakshi

పోడు విషయంలో గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం

అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి

సత్తుపల్లి సీఐ కిరణ్, కానిస్టేబుళ్లకు గాయాలు

ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో ఉద్రిక్తత

సత్తుపల్లి: గిరిజన వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన సత్తుపల్లి పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. ఘటన పూర్వాపరాలిలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని 400 హెక్టార్లలో కొంతకాలంగా స్థానిక గిరిజనులు, స్థానికేతర గిరిజనుల మధ్య పోడు వివాదం నడుస్తోంది. గిరిజనులకు నేతృత్వం వహిస్తున్న కూరం మహేంద్రను అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సీఐ టి.కిరణ్‌ పిలిపించి విచారించి పంపించారు.

ఈక్రమంలో చంద్రాయపాలెంకు చెందిన గిరిజనులు ఆదివారం ఉదయం డయల్‌ 100కు ఫోన్‌ చేసి  స్థానికేతర గిరిజనులు తమ భూముల్లోకి వస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత ఎస్సై రాజు, ముగ్గురు పోలీసు సిబ్బంది వెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న సమాచారంతో సీఐ టి.కిరణ్‌ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి చేరుకున్నారు.

సీఐ కిరణ్‌పై మెరుపుదాడి..
అదే సమయంలో గిరిజన నేత కూరం మహేంద్ర ఫోన్‌లో మాట్లాడుతుండగా, ‘నిన్ననే కదా నీతో మాట్లాడి పంపించింది.. మళ్లీ గొడవ ఏమిటి’ అంటూ సీఐ కిరణ్‌ ఆయన ఫోన్‌ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇంతలో ఒక్కసారిగా గిరిజన మహిళలు కోపోద్రిక్తులై సీఐ కిరణ్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు.

ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుళ్లు పి.నర్సింహారావు, ఇమ్రాన్, సత్యనారాయణ, నరేష్‌ కలిసి సీఐ కిరణ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో చుట్టూ రక్షణ కవచంలా నిలిచి పోలీస్‌ వ్యాన్‌ వైపు తీసుకొస్తుండగా గిరిజనులు కర్రలతో వెంబడించి దాడి చేశారు. అతి కష్టంమీద అక్కడి నుంచి సీఐ కిరణ్‌ను పోలీసులు తీసుకొని బయ టపడ్డారు. ఈ ఘటనలో సీఐ కిరణ్‌ చొక్కా చిరిగిపోయింది.

పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు
విషయం తెలుసుకుని కల్లూరు ఏసీపీ రఘు, రూరల్‌ సీఐ వెంకటేశం, డివిజన్‌లోని ఎస్సైలు, పెద్ద సంఖ్యలో  సిబ్బంది చంద్రాయపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బుగ్గపాడు శివారులో పోలీసులపై దాడి చేసిన గిరిజనులు గుంపులుగా వస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. గిరిజనులు ప్రతిఘటించటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి కూరం మహేంద్రతో సహా గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. 

Advertisement
Advertisement