‘లోహార’కు త్వరలో ఇంటర్నెట్‌ | Sakshi
Sakshi News home page

‘లోహార’కు త్వరలో ఇంటర్నెట్‌

Published Sat, Oct 30 2021 3:33 AM

Authorities Taken Steps To Make Internet Services In Lohara Village - Sakshi

ఆదిలాబాద్‌ రూరల్‌: ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం లోహార గ్రామంలో ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రామంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, నెట్‌ సరిగా లేక విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు గుట్టలు, చెట్లు ఎక్కుతున్న తీరుపై ‘సిగ్నల్‌ దొరికేనా.. పాఠం వినేనా’అనే శీర్షికతో జూలై 3న ‘సాక్షి’మెయిన్‌ పేజీలో ఫొటో కథనం ప్రచురితమైంది.

దీనిపై స్పందించిన టెలికం టెస్, టెరా టెక్నో సొల్యూషన్స్, టెలికం శాఖ అధికారులు నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం రెండు రోజుల పాటు లోహార గ్రామంలో సర్వే చేశారు. పీఎం–వాణి ద్వారా త్వరలో ఇంటర్నెట్‌ అందుబాటులో తెస్తామని ఈ సందర్భంగా టెలికం శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.శివరాంప్రసాద్‌ తెలిపారు.

ఈ మేరకు లోహార గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పీఎం–వాణి పథకంలో భాగంగా పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీవో)ల ఏర్పాటుపై అవగాహన కల్పించామని చెప్పారు. గతంలో టెలిఫోన్‌ బూత్‌ల వద్ద ఎలా ఫోన్‌ ఉపయోగించేవారో అలాగే పీడీవోకు వచ్చి ఇంటర్నెట్‌ వాడుకోవచ్చన్నారు. చేతిలో ఫోన్‌ లేకున్నా పీడీఓలో అందుబాటులో ఉండే ఫోన్‌ ద్వారా తమ పనులు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. 

Advertisement
Advertisement