Sakshi News home page

బండి సంజయ్‌ ఫోన్‌ ఎక్కడ? దానితోనే ఏ–2 ప్రశాంత్‌తో సంభాషణ!.. అసలు ఆ రోజు ఏం జరిగింది?

Published Sun, Apr 9 2023 5:47 PM

Bandi Sanjay Complaint To Karimnagar Police About His Phone Missing - Sakshi

సాక్షి, కరీంనగర్‌/ హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఫోన్‌ ఎక్కడుంది? అనేది చర్చనీయాంశమయ్యింది. కలకలం రేపిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుట్రలో సూత్రధారిగా అనుమానిస్తూ పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా అరెస్టు అయినప్పటి నుంచి ఆయన ఫోన్‌ కన్పించకుండా పోయింది. అయితే బెయిల్‌పై విడుదలైన సంజయ్‌..ఆదివారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అరెస్టు సమయం నుంచి తన వ్యక్తిగత ఫోన్‌ కన్పించడం లేదని పేర్కొంటూ పట్టణ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిని ఎలాగైనా వెదికి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఆ ఫోన్‌ తన సోదరి పేరు మీద ఉందని, భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో తాను ఆమె పేరు మీద ఉన్న సిమ్‌కార్డు వాడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆదివారం రాత్రి పార్టీ లీగల్‌ సెల్‌ నేతలతో భేటీ అయిన సంజయ్‌.. తన ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని ఆరోపించడం గమనార్హం. కాగా రాత్రి పార్టీ లీగల్‌ సెల్‌ నేతలతో భేటీ అయిన సంజయ్‌..తన ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని ఆరోపించారు. 

అసలు ఆ రోజు ఏం జరిగింది? 
అరెస్టు అనంతరం సంజయ్‌ను పోలీసులు బొమ్మల రామారం తీసుకెళ్తున్న క్రమంలో ఆయన ఫోన్‌ కనిపించకుండా పోయింది. వరంగల్‌ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ ఫోన్‌ సాయంతోనే ఏ–2 ప్రశాంత్‌తో సంజయ్‌ (ఏ–1) పదేపదే సంభాషించారు. ఈ కేసు ఛేదనకు ఎంతో కీలకమైన సాంకేతిక ఆధారం కావడంతో కుట్ర కేసు మొత్తం ఫోన్‌ చుట్టే తిరుగుతోంది.

అయితే ఆ ఫోన్‌ సంజయ్‌ సమీప అనుచరుడైన బోయినపల్లి ప్రవీణ్‌ రావు వద్ద ఉండి ఉంటుందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. బ్యాటరీ అయిపోవడం వల్ల స్విచ్‌ ఆఫ్‌ అయి ఉంటుందని, చివరిగా అది సిద్దిపేట టవర్‌ లొకేషన్‌ చూపించిందని, తప్పనిసరిగా బండి అనుచరులే దాన్ని దాచారని, ఆధారాలు దొరక్కుండా ఇప్పటికే ధ్వంసం చేసి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అది పోలీసుల పనే..: సంజయ్‌ 
తన సెల్‌ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి సిద్దిపేట వెళ్లే వరకు తన చేతిలోనే ఉన్న ఫోన్‌ ఆ తర్వాత మాయం అయ్యిందని పేర్కొన్నారు. మాయం చేసినవారే తనను ఫోన్‌ అడగడం సిగ్గు చేటన్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు ఆదివారం రాత్రి రాష్ట్ర లీగల్‌ సెల్‌ నేతలతో భేటీ అయిన సందర్భంగా బండి మాట్లాడారు. 

కేసీఆర్‌ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు.. 
‘మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఆ విషయం తెలిసి సీఎం కేసీఆర్‌ మూర్ఛపోయారు. నా ఫోన్‌ బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే భయంతో కేసీఆర్‌ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు. ఇతరుల ఫోన్ల సంభాషణలు వినడమే ఆయన పని..’అని సంజయ్‌ ఆరోపించారు. ‘బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరు. దేశం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారు. పేపర్‌ లీకేజీ విషయంలో కేసీఆర్‌ కొడుకు రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నాం. రాజీనామా విషయంలో కేసీఆర్‌ కుటుంబానికో న్యాయం? ఇతరులకో న్యాయమా?..’అని ప్రశ్నించారు. 

నిర్బంధాలు పెరిగే అవకాశం 
‘రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలపై నిర్బంధాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందువల్ల లీగల్‌ సెల్‌ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలి. మీరున్నారనే ధైర్యం, కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. మీరు మాకు అండగా ఉండండి..’అని సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరును, పోలీసుల వైఖరిని సంజయ్‌ తప్పుపట్టారు. ‘ప్రధాని మోదీని అవమానించేలా తిడతారు. ఆయన దిష్టి»ొమ్మలను తగలబెడతారు. వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారు. కేసీఆర్‌ను తిడితే మాత్రం నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతారు. పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారు..’అని ధ్వజమెత్తారు. 

చదవండి: ఈనెల 14న తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే


బండి సంజయ్‌ ఫిర్యాదు కాపీ

Advertisement

What’s your opinion

Advertisement