అంబేడ్కర్‌కు తెలంగాణ ఘన నివాళి ఇది  | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌కు తెలంగాణ ఘన నివాళి ఇది 

Published Fri, Apr 14 2023 3:17 AM

CM KCR Comments On DR BR Ambedkar Statue In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ మహా విగ్రహాన్ని ప్రతిష్టిస్తుండటం రాష్ట్రానికే కాక దేశానికే గర్వకారణమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలోని ఆర్టికల్‌–3ను పొందుపరిచిన తెలంగాణ బాంధవుడికి తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి అని ప్రకటించారు. రాష్ట్ర నూతన సచివాలయానికి ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’అని పేరుపెట్టి సమున్నతంగా గౌరవించుకున్నామని తెలిపారు.

శుక్రవారం అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా.. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో ఆయన పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చిన అంబేడ్కర్‌ రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్‌ ప్రపంచాన్ని ఆలోచింపజేశాయన్నారు.

సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. దళితబంధు, గురుకులాలు, ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక నిధి, అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, టీఎస్‌ ప్రైడ్, మూడెకరాల భూపంపిణీ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాలు, కార్యక్రమాలతో దళితులు ఎంతో ఎదుగుతున్నారని, చేయూతనిస్తే సమాజంలో ఎవరికీ తీసిపోమనే విషయాన్ని రుజువు చేస్తున్నారని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement