Fire Accident In Building At Secunderabad Ramgopalpet, Details Inside - Sakshi
Sakshi News home page

Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే!

Published Thu, Jan 19 2023 12:30 PM

Fire Accident In Building At Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌: అది దుకాణాలు, జనావాసాల మధ్య ఉన్న భవనం.. మెల్లగా పొగలు రావడం మొదలైంది.. కాసేపటికే భవనమంతా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఉధృతంగా మంటలు, పొగ ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం రాత్రి అయిందేమో అన్నట్టుగా మారిపోయింది. ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల భవనాలు, దుకాణాల వారు భయాందోళనకు లోనయ్యారు.

మరోవైపు సామగ్రిని కాపాడుకునేందుకు భవనంలోకి వెళ్లిన ముగ్గురు ఉద్యోగులు గల్లంతయ్యారు. సికింద్రాబాద్‌లోని మినిస్టర్స్‌ రోడ్‌లో ఉన్న రాధా ఆర్కేడ్‌ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన ఇది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. 

ఉదయం పొగలతో మొదలై.. 
రాధా ఆర్కేడ్‌ భవనంలో 2010 నుంచి టీ–షర్టులు, ట్రాక్స్, టోపీలు తయారుచేసి విక్రయించే డెక్కన్‌ కార్పొరేట్, డెక్కన్‌ నైట్‌ సంస్థలు కొనసాగుతున్నాయి. భవనం సెల్లార్‌–1లో చెకర్డ్‌ ఫ్లాగ్‌ కార్‌ డెకార్స్‌ గోదాం, సెల్లార్‌లో ఆ కార్‌ డెకార్స్‌ దుకాణం, డెక్కన్‌ కార్పొరేట్‌ వస్త్ర గోదాం ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో డెక్కన్‌ కార్పొరేట్‌ వస్త్రాల హోల్‌సేల్‌ షాపు ఉండగా.. పైన అంతస్తుల్లో డెక్కన్‌ నైట్‌ సంస్థ వస్త్రాల తయారీ, నిల్వకు వినియోగిస్తున్నారు.

గురువారం ఉదయం సెల్లార్‌లో స్వల్పంగా పొగలు కనిపించాయి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కార్‌ డెకార్స్‌ యజమాని.. తన దుకాణాన్ని పరిశీలించి, బాగానే ఉండటంతో డెక్కన్‌ సంస్థ వారిని అప్రమత్తం చేశారు. వారు సరిగా పట్టించుకోలేదు. ఉదయం 10.30 గంటల సమయంలో పొగలు దట్టంగా మారాయి. కాసేపటికే సెల్లార్‌–1, గ్రౌండ్‌ ఫ్లోర్‌లకూ విస్తరించాయి.

దీనిపై చుట్టుపక్కల వారు అగ్నిమాపకశాఖకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికల్లా సెల్లార్‌–1 నుంచి మూడో ఫ్లోర్‌ వరకు మంటలు విస్తరించాయి. అప్పటికే పైన ఐదు, ఆరో అంతస్తుల్లో పనిచేస్తున్న పెయింటర్‌ మిథిలేశ్‌ కుమార్, మార్బుల్‌ వర్కర్లు రూపేష్, బిబాష్, రామ్‌రాజ్‌ సింగ్‌లను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. 

వద్దన్నా లోపలికి వెళ్లి.. గల్లంతై.. 
మధ్యాహ్నం 12 గంటల సమయంలో భవనం వద్దకు వచ్చిన డెక్కన్‌ సంస్థ ఉద్యోగులు వసీమ్, జహీర్, జునైద్‌ ముగ్గురు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా పక్కన ఉన్న ద్వారం తెరుచుకుని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి ప్రవేశించారు. అప్పటికే గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి పై అంతస్తులకు మంటలు భారీగా వ్యాపించాయి. లోపలికి వెళ్లిన ముగ్గురు ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

వారి కోసం ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకుని భవనంలోకి ప్రవేశించినా.. మంటలు, వేడి వాయువుల ధాటికి అస్వస్థతకు గురై బయటికి వచ్చారు. అధికారులు వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించా రు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. 

ఆ ముగ్గురి కోసం నేడు గాలింపు 
రాధా ఆర్కేడ్‌ భవనంలో మంటలు రాత్రి 9.30 గంటలకు అదుపులోకి వచ్చినా ఆ తర్వాత కూడా పొగలు కొనసాగాయి. దానికితోడు మంటల ధాటి కి భవనం బలహీనపడి కూలిపోయే ప్రమాదం ఉండటంతో.. లోపలికి వెళ్లి గల్లంతైన ముగ్గురి కోసం శుక్రవారం ఉదయం గాలింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. భవనం సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గల్లంతైన ముగ్గురూ గుజరాత్‌ నుంచి వలస వచ్చిన కార్మికులని గుర్తించారు. వీరిలో వసీమ్, జహీర్‌ తమ కుటుంబాలతో నల్లగుట్టలో నివసిస్తుండగా.. జునైద్‌ ఇదే భవనం మూడో అంతస్తులో ఉంటున్నట్టు తెలిసింది. 

నివాసం కోసం అనుమతి తీసుకుని.. 
మినిస్టర్స్‌ రోడ్‌లోని ఈ భవనానికి 2006లో సెల్లార్, గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు పైన నాలుగు అంతస్తులు నిర్మిస్తామంటూ అనుమతి తీసుకున్నారు. అధికారులు సెల్లార్‌లో వాహనాల పార్కింగ్‌కు, మిగతా ఫ్లోర్లకు నివాసాల కోసం అనుమతి ఇచ్చారు. కానీ దాని యజమాని సెల్లార్‌–1, సెల్లార్‌–2, గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు 4 అంతస్తులు నిర్మించి.. వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. తర్వాత ఐదు, ఆరో అంతస్తుల నిర్మాణమూ చేపట్టారు. పనులు చివరిదశలో ఉన్నాయి. భవన యజమాని 2015లో వచ్చిన బీఆర్‌ఎస్‌ (బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌) పథకం కింద కమర్షియల్‌గా వాడుతున్న గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు అక్రమంగా కట్టిన 5, 6 అంతస్తులను క్రమబద్ధీకరించుకున్నారు. 

డెక్కన్‌ సంస్థ యజమాని అరెస్టు 
రాధా ఆర్కేడ్‌ భవనంలో డెక్కన్‌ సంస్థను మహ్మద్‌ ఒవైసీ, ఆయన తండ్రి జావీద్‌ నిర్వహిస్తున్నారు. పై రెండు అంతస్తులను నల్లగుట్టకు చెందిన ఎంఏ రహీం అనే వ్యక్తి నివసించడం కోసం కట్టిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి మహ్మద్‌ ఒవైసీ, జావీద్‌లపై రాంగోపాల్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేసి.. మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ప్రమాదకర భవనాలపై స్పెషల్‌ డ్రైవ్‌: మంత్రి తలసాని
హైదరాబాద్‌ నగరంలో చాలా ఏళ్లుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని.. నిబంధనలు పాటించని, ప్రమాదకర భవనాల విషయంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది, డీఆర్‌ఎఫ్, పోలీసులు వేగంగా సహాయక చర్యలు చేపట్టారన్నారు. ఘటనపై పూర్తి నివేదిక తెప్పిస్తామని.. నిబంధనలు పాటించని షాపులు, గోదాములపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. 

కఠినచర్యలు చేపడతాం: మంత్రి మహమూద్‌ అలీ 
నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న గోదాములపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గోదాములో ఎక్కువగా ప్లాస్టిక్‌ వస్తువులు, సింథటిక్‌ వస్త్రాలు ఉండటంతో మంటలు అదుపులోకి రావడం కష్టమైందన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి కఠినచర్యలు తీసుకుంటామన్నారు.  

40 ఫైరింజన్లు.. 200కుపైగా ట్యాంకర్లు 
మొదట ఒకట్రెండు ఫైరింజన్లతో నీరు చల్లడం మొదలుపెట్టిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు తీవ్రం కావడం, ముగ్గురు ఉద్యోగులు లోనికి వెళ్లడంతో ఉధృతంగా సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఫైరింజన్లను, వాటికి నీటి కోసం జల మండలితోపాటు ప్రైవేటు ట్యాంకర్లను వెంట వెంటనే రప్పించారు.

దాదాపు 40 ఫైరింజన్లు, 200కుపైగా ట్యాంకర్లను వినియోగించారు. ఉదయం దాదాపు 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కూడా సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. భవనంలో అంతా వస్త్రాలు, రెగ్జిన్, ప్లాస్టిక్, ఫైబర్‌ మెటీరియల్‌ ఉండటంతో మంటలను అదుపులోకి తీసుకురావడం కష్టమైందని అధికారులు చెప్తున్నారు. ప్రమాదం కారణంగా గురువారం ఉదయం నుంచీ మినిస్టర్స్‌ రోడ్‌ను మూసేశారు. దీనితో చుట్టుపక్కల మార్గాల్లో పొద్దంతా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

అంతా వస్త్రం, ప్లాస్టిక్‌ మెటీరియల్‌ కావడంతో.. 
రాధా ఆర్కేడ్‌ భవనంలో ఉన్న డెక్కన్‌ కార్పొరేట్‌ సంస్థ మొత్తం వస్త్ర మెటీరియల్‌కు సంబంధించినదే. పైగా రెండు సెల్లార్‌లలో ఉన్న కార్‌ డెకార్స్‌కు చెందిన సామగ్రి అంతా ప్లాస్టిక్, ఫైబర్‌తో పాటు బాగా మండిపోయే స్వభావం ఉన్నది కావడంతో.. మంటలు చాలా ఉధృతంగా వచ్చాయి. ఒక సమయంలో దాదాపుగా భవనం ఎత్తున ఎగిసిపడ్డాయి.

మంటల ఉధృతి, నల్లటి దట్టమైన పొగల కారణంగా రాధా ఆర్కేడ్‌ భవనం చుట్టుపక్కల కొంత ప్రాంతం చీకటి కమ్మినట్టుగా అయిపోయింది. మంటలు ఇతర భవనాలకూ విస్తరించే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. చుట్టుపక్కల మూడు భవనాల్లోని 21 కుటుంబాలను, ఎనిమిది దుకాణాలను ఖాళీ చేయించారు. రాధా ఆర్కేడ్‌ భవనంలో పలుగోడలు, పిల్లర్లు పగుళ్లు ఇవ్వడంతో.. అది కూలిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు.  

Advertisement
Advertisement