ఔరా.. ముగ్గురేనా? 

13 Jan, 2021 10:15 IST|Sakshi

కోటి మంది జనాభాకు ఉన్నది ముగ్గురు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు 

సాక్షి, హైదరాబాద్‌: కోటిమంది జనాభా ఉన్న మహా నగరంలో ఆహారకల్తీ నిరోధానికి తగిన యంత్రాంగం లేదు. కేవలం ముగ్గురంటే ముగ్గురే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో అడ్డూఅదుపూ లేకుండా సాగుతోన్న కల్తీతో ప్రజలు తరచూ అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. దాదాపుగా పదినెలలుగా కరోనా నేపథ్యంలో బయటి ఫుడ్‌ తినేవారు తగ్గినప్పటికీ..ఇప్పుడిప్పుడే తిరిగి హోటళ్లు, తదితర ప్రాంతాల్లో ఎగబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ జరగకుండా.. తగిన పరిశుభ్రతతో, ఇతరత్రా జాగ్రత్తలతో వ్యవహరించాల్సి ఉండగా అలాంటివేమీ కనిపించడం లేదు. తగినంతమంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు లేక తనిఖీలు జరగకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 30 సర్కిళ్లకు 30 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా..పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ప్రభుత్వం గత సంవత్సరం ఎంపిక చేసిన 20 మందికి శిక్షణ పూర్తికావాల్సి ఉంది. అందుకు మరో 40 రోజులు పట్టనుంది. అది పూర్తయితే కానీ వీరు  విధులు నిర్వహించలేరు. జీహెచ్‌ఎంసీకి సంబంధించి మొత్తం 26 పోస్టులు మంజూరైనప్పటికీ , కోర్టు వివాదాలు ఇతరత్రా కారణాలతో 20 మందినే ఎంపిక చేశారు.   ఆరు జోన్లకు ఆరుగురు గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా, ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. వీరిలో ఇద్దరు రిటైరైనా పొడిగింపుతో కొనసాగుతున్నారు, రైగ్యులర్‌గా ఉన్నది ఒక్కరే. 
జీహెచ్‌ఎంసీ లెక్కల మేరకు నగరంలో..  
చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లు : 10,000 
సాధారణ నుంచి స్టార్‌ హోటళ్లు : 3,000 
ఇతరత్రా తినుబండారాల దుకాణాలు: 2,000 

ఏటా 230 శాంపిల్సే.. 
ఇన్ని ఈటరీస్‌ ఉన్నా ఏటా 230 శాంపిల్స్‌ మించి తీయలేకపోతున్నారు. పలు పర్యాయాలు కల్తీ గుర్తించినప్పటికీ, జరిమానాలు మించి పెద్దగా శిక్షలు పడటం లేదు.  హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే  వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ చర్యలు తీసుకునేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఆర్డర్లపై జరిగే ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి.  

పలు సంస్థల విజ్ఞప్తి.. 
ఆహారకల్తీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ సెక్రటరీ ఎం.పద్మనాభరెడ్డి మునిసిపల్‌ మంత్రి కేటీర్‌ను ఇటీవల కోరారు. కల్తీ ఫిర్యాదులకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటుతోపాటు అదనంగా మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నివేదించారు. ఇతరత్రా సంస్థలు సైతం ఆహారకల్తీ నిరోధంతోపాటు కరోనా నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, కనీస దూరం పాటింపు వంటివి అమలు చేయాలని కోరుతున్నాయి.  

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ ఎక్కడ? 
ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ (‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌–2002)  గ్రేటర్‌లో అమలుకు నోచుకోలేదు. 2011 ఆగస్టు నుంచే ఇది అమల్లోకి వచ్చినప్పటికీ, నగరంలో అమలు కావడం లేదు. ఈ చట్టం మేరకు, ఆస్తిపన్ను వివరాల మాదిరిగా ప్రతి ఆహార విక్రయ కేంద్రం వివరాలు జీహెచ్‌ఎంసీ వద్ద ఆన్‌లైన్‌లో జాబితా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని గుర్తించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి. కల్తీ నిర్ధారణ అయినప్పుడు కఠిన శిక్షలుండాలి. ఇవేవీ అమలు కావడం లేదు.

అంతటా కల్తీ.. 
ఆహారపదార్థాలు  ఉత్పత్తయ్యే ప్రాంతం నుంచి మొదలుపెడితే ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం దాకా ఎక్కడా కల్తీకి ఆస్కారం ఉండొద్దు. దీన్ని అమలు చేసేందుకు తగిన పరిపాలనాధికారులతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అవసరం ఉండగా, అమలు కావడం లేదు.   

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు