Sakshi News home page

శ్మశానాల్లో భూబకాసురులు

Published Mon, Mar 29 2021 8:22 AM

Hyderabad: Inveders Does Not Even Leave The Cemetery - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహానగరంలో గజం భూమి విలువ కనీసం రూ.40వేల నుంచి లక్షలకు పైనే. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసే భూబకాసురులు శ్మశాన వాటికలను సైతం వదలడం లేదు. ఇప్పటి వరకు శ్మశాన వాటికల స్థలాల్లో అక్రమ దుకాణ సముదాయాలు ఏర్పాటు కాగా,  తాజాగా నివాస సముదాయాల కోసం కూడా నిర్మాణాలకు దిగుతున్నారు. నగరంలోని పలు శ్మశాన వాటికల్లో  అక్రమ నిర్మాణాలు సాగుతున్న విషయం దృష్టికి రావడంతో  వక్ఫ్‌బోర్డు తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. 

వక్ఫ్‌ భూములను అల్లాహ్‌కు చెందిన ఆస్తులుగా పరిగణిస్తారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం గతంలో రాజులు, సంపన్న వర్గాలకు చెందిన వారు మంచి కార్యక్రమాల నిమిత్తం తమ సొంత స్థలాలను ఆధ్యాత్మిక గురువుల పేరిట దర్గాలు, శ్మశాన వాటికలు, మసీదులకు కేటాయించి వక్ఫ్‌ చేసేవారు. ఇలాంటి భూములను ‘మున్షాయే వక్ఫ్‌’గా పేర్కొంటారు. ఎక్కువ శాతం శ్మశానవాటికల స్థలాలపై పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి.  

అక్రమార్కుల చెరలో..   
► నగరంలోని పలు శ్మశాన వాటికలు క్రమంగా అక్రమణలకు గురవుతున్నాయి. కోట్ల విలువైన దేవుడి(వక్ఫ్‌) స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అందులో కొన్ని మచ్చుతునకలు.. 
► మల్లేపల్లిలో గల హజరత్‌ యూసిఫైన్‌ దర్గా శ్మశాన వాటికలో కొంత మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు అక్రమంగా దుకాణాలు కూడా వెలిశాయి.  
► మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతంలోని సయ్యద్‌ అహ్మాద్‌బాద్షా దర్గాకు సంబంధించిన ఎనిమిది ఎకరాల్లో ముందు భాగంలో సమాధులను తొలగించి  దుకాణాల సముదాయాలను నిర్మించుకొని దర్జాగా వ్యాపారాలు     సాగిస్తున్నారు. 
► పాతబస్తీలోని మిస్రీగంజ్, షంషీర్‌గంజ్‌ స్మశాన వాటిక స్థలాల్లో  అక్రమంగా దుకాణాల సముదాయాలను నిర్మించారు.  ప్రస్తుతం ఆ మడిగల్లో ఒక హోటల్‌తోపాటు పలువ్యాపారాలు సాగుతున్నాయి. 
►  సైదాబాద్‌లోని హజరత్‌ ఉజేలాషా దర్గా, హజరత్‌ సయ్యద్‌ బాద్‌షా మహజూద్‌ సాహెబ్‌ దర్గాల స్మశాన వాటికల్లో  దుకాణాల సముదాయాలతోపాటు నివాస గృహాలు కూడా  వెలిశాయి.

అక్రమ కట్టడాలను తొలగిస్తాం  
శ్మశాన వాటిక స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తాం.అక్రమార్కులు తక్షణమే అక్కడినుండి ఖాళీ చేయాలి, దుకాణాలను సైతం తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. 
– సలీం, చైర్మన్, వక్ఫ్‌బోర్డు, తెలంగాణ  

చదవండి: 16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై..

Advertisement

What’s your opinion

Advertisement