80 దేశాలకు విత్తనాల ఎగుమతులు | Sakshi
Sakshi News home page

80 దేశాలకు విత్తనాల ఎగుమతులు

Published Sat, Feb 26 2022 3:04 AM

Hyderabad: Niranjan Reddy Inaugurates International Seed Testing Lab - Sakshi

ఏజీ వర్సిటీ (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మెట్ట పంటలకే పరిమితమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణిగా మారిందని చెప్పారు.

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షాకేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు.  విత్తన పరీక్ష యంత్రాలను, నూతన వంగడాలను, మొలకలను అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్లే పత్తి  దిగుబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉందని, వరి దిగుబడిలో పంజాబ్‌ను తలదన్నామని తెలిపారు. రాష్ట్రంలో విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ఏజీ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement