అడ్వాన్స్‌డ్‌ ఆషామాషీ కాదు | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌డ్‌ ఆషామాషీ కాదు

Published Mon, May 1 2023 2:12 AM

JEE Advanced exam on June 4 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ అడ్వాన్స్‌డ్‌పై ఉంది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఈ పరీక్ష జూన్‌ 4వ తేదీన జరగనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే కష్టపడకపోతే అడ్వాన్స్‌డ్‌లో గట్టెక్కడం అంత తేలికైన విషయమేమీ కాదని నిపుణులు అంటున్నారు.

మంచి ర్యాంకు సాధిస్తేనే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్‌ చేసే అవకాశం దక్కుతుందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో సబ్జెక్టులపై పట్టు సాధించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 99 పర్సంటైల్‌ వచ్చి న వాళ్ళ సంఖ్య ఈసారి వేలల్లో ఉంది కాబట్టి అడ్వాన్స్‌డ్‌లో నెట్టుకురావాలంటే ప్రిపరేషన్‌ గట్టిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.  

గణితంపై దృష్టి పెట్టాల్సిందే 
జేఈఈ మెయిన్స్‌లో గణితం పేపర్‌ ప్రతి ఏటా కఠినంగానే ఉంటోంది. అడ్వాన్స్‌డ్‌లో ఇది మరింత కష్టంగా ఉంటోంది. ప్రతి సబ్జెక్టుకూ 120 మార్కులుంటాయి. అయితే గణితంలో 20 మార్కులు సాధించడం గగనమవుతోంది. గత సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ రాసిన వాళ్ళల్లో ఈ మేరకు సాధించినవారు కేవలం 1,200 మంది మాత్రమే ఉన్నారు. ఇక రసాయన శాస్త్రంలో 20 మార్కులు దాటిన వాళ్ళు 2 వేలు, భౌతిక శాస్త్రంలో 4 వేల మంది ఉన్నారు.

అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిలో ఐఐటీ సీట్లకు కేవలం 55 వేల మందినే ఎంపిక చేస్తారు. అందువల్ల వడపోత కఠినంగానే ఉంటుంది. ఈసారి ఎక్కువమంది జేఈఈ మెయిన్స్‌ రాయడంతో కటాఫ్‌ కూడా పెరిగింది. కాబట్టి వడపోతకు వీలుగా అడ్వాన్స్‌డ్‌ పేపర్లు కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బోంబేదే హవా  
ఐఐటీల్లో బోంబేకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇందులో సీటు కోసం పోటీ పడుతుంటారు. తొలి 50 ర్యాంకుల్లో 46 మంది బోంబేలోనే చేరడం గమనార్హం. మొదటి వెయ్యి ర్యాంకుల్లో 246 మంది ఇక్కడ ప్రవేశం పొందారు. గత ఏడాది 3,310 మంది బాలికలకు ఇందులో సీట్లు దక్కాయి.

ఇక అత్యధికంగా తిరుపతి ఐఐటీలో 20.7 శాతం మంది సీట్లు పొందారు. అతి తక్కువగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 17.7 మంది సీట్లు పొందారు. విదేశీ విద్యార్థులు 145 మంది అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైతే 66 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు.  కాగా తొలి వెయ్యి ర్యాంకుల్లో ఢిల్లీలో 210, మద్రాసులో 110, కాన్పూర్‌లో 107, ఖరగ్‌పూర్‌లో 93, గువాహటిలో 66, రూర్కీలో 60, హైదరాబాద్‌లో 40, వారణాసిలో 31, ఇండోర్‌లో ఏడుగురు, రోవర్‌లో ఒకరు చేరారు.  

Advertisement
Advertisement