మావోల సరికొత్త ఎత్తుగడ | Sakshi
Sakshi News home page

పోలీసుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు.. మావోల సరికొత్త ఎత్తుగడ

Published Fri, Feb 2 2024 7:29 PM

Maoists New Strategy To Counter Attacks For Police Force - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో బంకర్‌ వెలుగుచూసిన నేపథ్యంలో మావోయిస్టులు సరికొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నట్టు తెలిసింది. దశాబ్దంన్నర కాలంగా బస్తర్‌ అడవుల్లో మావోయిస్టులు నిర్వహిస్తున్న జనతన సర్కార్‌ను నిర్వీర్యం చేసేందుకు భద్రతాదళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వందల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ క్రమంగా అడవులపై పట్టు సాధిస్తున్నాయి. దీంతో పోలీసుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేసే పనిలో మావోయిస్టులు ఉన్నారు. ఈ మేరకు 80 పేజీలతో కూడిన ప్రత్యేక డాక్యుమెంట్‌ను గోండు భాషలో తయారు చేశారు. ఇందులో ఉన్న రణతంత్ర వివరాలపై గతంలోనే జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, దీనిని ఆతర్వాత కొందరు హిందీలోకి అనువదించినట్టు తెలిసింది. 

ఆకాశదాడులు తిప్పికొట్టేలా.. 
డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతాదళాలు తమపై రెండేళ్లుగా దాడులు చేస్తున్నాయంటూ మావోయిస్టులు ఆరోపిస్తుండగా, మావోయిస్టుల ఏరివేతకు వాయు దాడులు చేయడం లేదని భద్రతాదళాలు చెబుతున్నాయి. డ్రోన్లు ఉపయోగించినా నిఘా కోసమే తప్ప దాడులకు కాదంటున్నారు. ఇలా భిన్నవాదనలు ఉన్నా, ఆకాశ దాడులను తట్టుకోవడంతో పాటు తిప్పికొట్టే వ్యూహాలపై మావోయిస్టులు తీవ్రంగా ఆలోచించారు. ఈమేరకు రక్షణ వ్యూహాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల దాడుల నుంచి తప్పించుకునే అంశంపై డాక్యుమెంట్‌లో చర్చించారు. తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఎదురైతే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయించారు. డ్రోన్లు, హెలికాప్టర్‌ దాడులను తిప్పికొట్టేలా ‘చెట్లపై నుంచి రాకెట్‌ లాంచర్లు పేల్చడం’పై కేడర్‌కు శిక్షణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. డ్రోన్లపై తేలికగా దాడులు చేసేందుకు వీలుగా కొండపై ఎత్తయిన ప్రాంతాల్లో గస్తీ బృందాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచే లాంగ్‌ పైప్‌ బాంబులను ప్రయోగించే దానిపై ఫోకస్‌ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  



మూడడుగుల బంకర్లు 
డ్రోన్లు, హెలికాప్టర్ల కంట పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా డాక్యుమెంట్‌లో చర్చించారు. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు అడవిలో ఆరుబయట ప్రాంతంలో కాకుండా పైనుంచి చూస్తే కనిపించకుండా ఉండే చెట్ల కిందే విశ్రమించాలని నిర్ణయించారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే...కనీసం మూడు అడుగుల లోతుతో బంకర్లు నిర్మించాలని డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. 

కొత్తగా మావోయిస్టు స్నైపర్‌ టీమ్‌లు  
మావోయిస్టులకు ఇప్పటికే బెటాలియన్లు, ప్లాటూన్లు, లోకల్‌ గెరిల్లా స్క్వాడ్, యాక్షన్స్‌ టీమ్‌లు ఉన్నాయి. అయితే అబూజ్‌మడ్‌ అడవుల్లో డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులు పెరిగిపోతున్నాయి. ఒకేసారి వందల మందితో కూడిన బెటాలియన్లు అడవుల్లో నలుదిశలా కూంబింగ్‌ చేస్తున్నాయి. దీంతో భద్రతాదళాలపై అందుబాటులో ఉన్న కేడర్‌తో అంబూష్‌ దాడి చేయడం మావోయిస్టులకు సాధ్యం కావడం లేదు. కనీసం కూంబింగ్‌ స్పీడ్‌కు బ్రేకులు వేయడం సైతం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్నైపర్‌ టీమ్‌లు ఏర్పాటు చేసే అంశంపై మావోయిస్టులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అడవుల్లోకి వచ్చే భద్రతాదళాలపై స్నైపర్‌ టీమ్‌ దాడి చేసి కనీసం ఒక్కరిని గాయపరచగలిగినా భద్రతా దళాల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, తద్వారా కూంబింగ్‌ స్పీడ్‌కు బ్రేకులు పడతాయనేది మావోయిస్టుల వ్యూహంగా ఉన్నట్టు తెలిసింది.

అగ్రనేతల సమావేశం? 
దంతెవాడ – బీజాపూర్‌ జిల్లా సరిహద్దులో వెలుగుచూసిన బంకర్‌లో మావోయిస్టు అగ్రనేతల సమావేశం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి రెండో వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావును మావోయిస్టు పార్టీ నియమించింది. అంతకుముందు ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన నాయకులు తాజాగా వెలుగు చూసిన బంకర్‌లోనే సమావేశమైనట్టు తెలుస్తోంది. 

:::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement
Advertisement