Coronavirus Third Wave: AIG Dr. D. Nageshwar Reddy Says 3rd Wave COVID-19 From August, Peak in September - Sakshi
Sakshi News home page

థర్డ్‌వేవ్‌: పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు?

Published Tue, Aug 10 2021 2:59 AM

Mild Covid Third Wave Coming In September First Week - Sakshi

పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు?
థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపుతుందని చాలా మంది భయపడ్డారు. అయితే అంత ఎక్కువగా ప్రభావం చూపకపోవచ్చు. పిల్లల్లోనూ యాంటీబాడీస్‌ ఏర్పడుతున్నాయి. పిల్లలకు వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. వారికి వ్యాక్సిన్లు వేస్తే సురక్షితంగా స్కూళ్లకు పంపొచ్చు.

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టు చివరన లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో మైల్డ్‌గా కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని ప్రముఖ వైద్యుడు, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా సెకండ్‌ వేవ్‌ కేసులు పూర్తిగా తగ్గలేదని, థర్డ్‌ వేవ్‌ వచ్చినా తక్కువ తీవ్రతతోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 3, 4 నెలల దాకా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, వ్యాక్సినేషన్‌ వేగం పెంచితే ఈ గండం నుంచి గట్టెక్కొచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో పోస్ట్‌ కోవిడ్‌ సిండ్రోమ్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై డా.డి.నాగేశ్వర్‌రెడ్డితో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ..

ప్రశ్న: ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితిపై మీ అంచనా?
జవాబు: సెకండ్‌ వేవ్‌ పూర్తిగా తగ్గలేదు. దేశవ్యాప్తంగా కేసులు వస్తూనే ఉన్నాయి. థర్డ్‌ వేవ్‌ వచ్చినా మధ్యస్థంగానే ఉండొచ్చు. దేశవ్యాప్తంగా రోజుకు కోటి డోసుల లెక్కన వ్యాక్సిన్‌ వేస్తే.. డెల్టా వేరియేషన్‌ కూడా సమస్య కాకపోయేది. ప్రస్తుతం రోజుకు 40 లక్షల డోసులే వేస్తున్నారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ను బయోలాజికల్‌ ఇవాన్స్‌ మొదలుపెట్టనుంది. త్వరలోనే జైడస్‌కు కూడా అనుమతి వస్తే మరో నెల రోజుల్లో టీకా కార్యక్రమం వేగవంతం అవుతుంది. అప్పుడు థర్డ్‌ వేవ్‌ ప్రభావాన్ని మరింత తగ్గించొచ్చు.

ప్రశ్న: ‘డెల్టా’ ఏ మేరకు వ్యాప్తిలో ఉంది?
జవాబు: కోవిడ్‌ జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వందలాది మంది చేరడం వంటి కారణాలతో ఇంకా కేసులు పెరుగుతున్నాయి. 80% మందికి ఇమ్యునిటీ వస్తేనే ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ఏర్పడి డెల్టా వేరియెంట్‌ పూర్తిగా పోతుంది. కొత్త వేరియెంట్లు  కూడా రావు. మన దగ్గర డెల్టా ప్లస్‌ ఎక్కువగా లేదు. యాంటీ బాడీస్‌ పెరిగిన వారిపై కరోనా ప్రభావం చూపట్లేదు. కొందరు టీకా తీసుకున్నా కూడా యాంటీబాడీస్‌ ఏర్పడట్లేదు. అలాంటి వారిలో ఈ వ్యాధి సీరియస్‌గా మారే అవకాశాలున్నాయి.

ప్రశ్న: చికిత్సకు సంసిద్ధమై ఉన్నామా?
జవాబు: సెకండ్‌ వేవ్‌ అంత సీరియస్‌గా థర్డ్‌ వేవ్‌ ఉండదనే అంచనాలున్నాయి. థర్డ్‌ వేవ్‌లో దేశవ్యాప్తంగా గరిష్టంగా రోజు లక్ష దాకా కేసులు రావొచ్చు. వచ్చే అక్టోబర్‌ చివరి నుంచి కరోనా కేసులు బాగా తగ్గిపోవచ్చనేది అంచనా. అయినా ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా 3, 4 నెలలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పెంచితే సెప్టెంబర్‌లో మైల్డ్‌గా థర్డ్‌ వేవ్‌ వచ్చి వెళ్లిపోతుంది. మోనో క్లోనల్‌ యాంటీ బాడీస్‌ చికిత్స అందుబాటులో ఉంది. ఈ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం ద్వారా ఇప్పటివరకు 375 మంది కోలుకున్నారు. 

ప్రశ్న: టీకాల ప్రభావశీలత ఎలా ఉంటోంది?
జవాబు: రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్ల ప్రభావశీలత (ఎఫికసీ) 95 శాతానికి పైగానే ఉంటోంది. ఇందులో కూడా వ్యాధి రాకుండా నిరోధించడం 75 శాతంగా ఉండగా, మరణాలు సంభవించకుండా టీకాలు 99 శాతం దోహదపడుతున్నాయి. సెకండ్‌ డోసు తీసుకున్న 15 రోజుల తర్వాతే పూర్తి రక్షణ వస్తుంది. ఒక డోసు వేయించుకున్న వారు, తగిన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్‌ సోకే అవకాశాలున్నాయి. సింగిల్‌ డోస్‌ తీసుకున్న వారిలో కోవాగ్జిన్, కోవీషీల్డ్‌లో కొంచెం అటుఇటుగా 60 నుంచి 65 శాతం రక్షణ లభిస్తోంది. మొదటి టీకా తీసుకున్న 12 నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌ వేసుకుంటే మంచిది. కరోనా వచ్చిన వారు ఒక్కడోస్‌ వ్యాక్సిన్‌ వేసుకుంటే సరిపోతుంది.

ప్రశ్న: ప్రజలు కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
జవాబు: ప్రధాన నగరాల్లో బాగానే ఉన్నా చిన్న పట్టణాల్లో కొంత నిర్లక్ష్యం కన్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, గాలి బాగా ఆడే ప్రదేశాల్లో ఉండటం, మూసి ఉన్న ప్రదేశాల్లో గుంపులుగా చేరకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న: పండుగల సీజన్‌ వల్ల కేసులు పెరిగే అవకాశాలున్నాయా?
జవాబు: అక్టోబర్, నవంబర్‌ దాకా వివిధ పండుగలు ఉన్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగలు పరిమితంగా ఇళ్లలోనే చేసుకుంటే మంచిది.

ప్రశ్న: సెకండ్‌ వేవ్‌ నుంచి పాఠాలు నేర్చుకున్నామా?
జవాబు: ఈ వైరస్‌కు వేగంగా మ్యుటేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేగంగా టీకాలు వేసుకుని అందరిలో ఇమ్యూనిటీ ఏర్పడేలా చూసుకోవాలన్నది తెలిసొచ్చింది. కరోనా సోకిణ వంద మందిలో కనీసం 30 మందిలో జీనోమ్‌ టైపింగ్‌ క్రమం తప్పకుండా చేయాలి. వైరస్‌లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో జాగ్రత్తగా గమనించాలి. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతులు, ప్రోటోకాల్స్‌తో మరణాల సంఖ్య బాగా తగ్గించుకోగలిగాం.

ప్రశ్న: కొత్త కేసులు నమోదవుతున్నాయా?
జవాబు: ఇప్పుడు పరిమితంగా క్లస్టర్స్, పాకెట్స్‌గా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ప్రభుత్వపరంగా క్లస్టర్‌ కంటైన్మెంట్‌ చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో లేదా ఏదో ఒక కాలనీ, ప్రాంతంలో కేసుల పెరుగుదల కనిపిస్తే ఆ పరిధి వరకు క్లస్టర్‌ కంటైన్మెంట్‌ చేస్తే వ్యాప్తిని నియంత్రించొచ్చు.

ప్రశ్న: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం ఎందుకు పుంజుకోవట్లేదు?
జవాబు: మనకు తగినంతగా టీకా నిల్వలు అందుబాటులో లేకపోవడం ఓ కారణం. ఇప్పుడు వీటి లభ్యత క్రమంగా పెరుగుతోంది. సోషల్‌ మీడియాలో టీకా వ్యతిరేక ప్రచారంతో నష్టం జరిగింది. ఎవరికి ఏ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి. ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్నా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు.  

Advertisement
Advertisement