మోదీ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్‌ ఫొటో పెట్టారా? | Sakshi
Sakshi News home page

మోదీ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్‌ ఫొటో పెట్టారా?

Published Mon, Sep 5 2022 2:12 AM

Minister Harish Rao Slams Nirmala Sitharaman Pm Photo Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లోని రేషన్‌షాపుల్లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫొటో పెట్టారా? నాటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పెట్టారా? ఇప్పుడు కేంద్ర నిధులు వినియోగిస్తే ప్రధాని మోదీ ఫొటో పెట్టాల్సిందేనంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడటం అసంబద్ధం. రాష్ట్రానికి వచ్చి మూడు విమర్శలు, ఆరు అబద్ధాలు ఆడి రాజ కీయం చేస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు..’’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యటనలో నిర్మలా సీతారామన్‌ చేసిన విమర్శలపై హరీశ్‌ ఓ ప్రకటనలో ఘాటుగా స్పందించారు. కేంద్రం చేస్తున్నదొకటి, నిర్మలా సీతారామన్‌ చెప్తున్నది మరొకటని విమర్శించారు.

సీఎంల ఉప సంఘం సిఫార్సుల అమలేది?
‘‘పేరుకు కేంద్ర పథకాలు. వాటిలో కేంద్ర వాటా తగ్గించి, రాష్ట్రాల వాటా పెంచారు. పనికి ఆహార పథకం వంటి పథకాలపై కొర్రీలు వేస్తూ నిధులు తగ్గిస్తున్నారు. కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారు. నీతి ఆయోగ్‌ నియమించిన సీఎంల ఉప సంఘం శాస్త్రీయంగా అధ్యయనం చేసి కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్యను తగ్గించి, ఐచ్ఛిక పథకాలను (ఆప్షనల్‌) ప్రవేశపెడితే రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని చేసిన సిఫార్సులను పట్టించుకోలేదు. ఇదేమిటో నిర్మలా సీతారామన్‌ ప్రజలకు వివరిస్తే బాగుండేది..’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం రుణాలను నియంత్రించే హక్కు కేంద్రానికి ఉందని చెప్తున్నారని.. మరి అదే కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితులను దాటి ఎలా అప్పులు చేస్తోందని ప్రశ్నించారు. కేంద్రానికి ఒకలా.. రాష్ట్రాలకు ఒకలా న్యాయం ఉంటుందా అని నిలదీశారు. పైగా రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం సెస్సుల రూపంలో పన్నులు వసూలు చేసుకోవడం ఏమిటని మండిపడ్డారు.

ఆర్థిక పరిస్థితిపై అన్నీ అబద్ధాలే..
దేశంలో స్థిర ధరల వద్ద జీడీపీ వృద్ధి క్షీణించిందని, చరిత్రలో లేనంతగా రూపాయి బలహీనపడటం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు వచ్చాయని.. ఇవన్నీ దేనికి
సంకేతాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల బతుకు భారమైపోతుంటే.. అంతా బాగుందనే స్వోత్కర్ష అవసరమా? అని నిలదీశారు. విభజన హమీలను పట్టించుకోకపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన రూ.7,103 కోట్ల బకాయిలను, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను విడుదల చేయకపోవడం, నిమ్జ్‌ రద్దు, నవోదయ విద్యా సంస్థలను మంజూరు చేయకపోవడం రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్ష కాదా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్‌ను రద్దు చేశారని.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐఎం వంటి జాతీయ విద్యా సంస్థలను ఇవ్వలేదని, రాష్ట్రంలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు.

తెలంగాణ ఆర్థికంగా పటిష్ట రాష్టం
జీఎస్‌డీపీ వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రమని, సొంత పన్నుల రాబడిలో అధిక వృద్ధి కలిగిన రాష్ట్రమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అప్పులు చేసినా తీర్చగలిగే స్థోమత ఉన్న రాష్ట్రమన్నారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలకు, బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు ఒకే రుణ పరిమితి విధించడం సరికాదని పేర్కొన్నారు. రుణాలు తీసుకోకుండా, పేదలకు రాయితీలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించడం రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల విషయంగా తెలంగాణపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. జాతీయ క్రైం రికార్డ్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం గత మూడేళ్లలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని స్పష్టమవుతోందన్నారు. 2018–19 నుంచి ఇప్పటివరకు 65లక్షల మందికి రూ. 57,880 కోట్లను రైతుబంధు పథకం కింద అందించామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారు చేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అబద్ధం చెప్పారని, డీపీఆర్‌ లేకుండానే కేంద్ర జల సంఘం అన్నిరకాల అనుమతులు ఇచ్చిందా? అని నిలదీశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement