ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలు.. జాతీయ మెడికల్‌ కమిషన్‌ హెచ్చరిక

17 Apr, 2023 04:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్‌ వంటి చర్యలకు పాల్పడరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) హెచ్చరించింది. విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని.. రోగులతో మర్యాదగా, సున్నితంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మారుతు­న్న వైద్య విధానాలు, సాంకేతికత, చికిత్సలపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. రోగులు, వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదని పేర్కొంది.

దేశంలో వైద్య విద్యార్థుల వృత్తిపరమైన బాధ్యతలపై ఎన్‌ఎంసీ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. వైద్య విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఈ అంశాలు కీలకమని పేర్కొంది. వైద్య విద్యార్థులు రోగులతో సమర్థవంతంగా మాట్లాడటానికి స్థానిక భాష నేర్చుకోవాలని కోరింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వైద్యారోగ్య అత్యవసర పరిస్థితుల వంటి సందర్భాల్లో వీలైనంత సాయం చేయాలని సూచించింది. 

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి 
కేవలం చికిత్సకే పరిమితం కాకుండా వైద్యారోగ్య వ్యవస్థపై నమ్మకం కలిగేలా రోగి–వైద్యుడి సంబంధం ఉండాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని.. జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించింది.

కేవలం పుస్తకాల నుంచే మాత్రమే కాకుండా అధ్యాపకుల అపార అనుభవం, ఆచరణాత్మక బోధన నుంచి నేర్చుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ప్రాక్టికల్‌ రికార్డులు, కేస్‌షీట్లను శ్రద్ధగా నిర్వహించాలని.. కాపీ చేయడం, తారుమారు చేయడం వంటివి చేస్తే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు