Sakshi News home page

‘పాలమూరు–రంగారెడ్డి’ని ఆపాల్సిందే.. 

Published Sat, Oct 30 2021 4:11 AM

NGT Verdict To Stay Palamuru Rangareddy lift Irrigation scheme Works - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాల్సిందేనని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు తప్పించుకోవడానికే తాగునీటి పేరు చెప్పి సాగునీటి ప్రాజెక్టు చేపడుతోందన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.

పిటిషనర్లు పర్యావరణ అంశంతో ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ పరిధి తమకుందని పేర్కొంది. పర్యావరణ అనుమతులు పొందే వరకూ ప్రాజెక్టుపై తెలంగాణ ముందుకు వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సంయుక్త కమిటీలో తెలంగాణ సభ్యులు మినహా మిగతా సభ్యులు పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తాము విశ్వసిస్తున్నామని జస్టిస్‌ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాల్లో స్పష్టం చేసింది.

‘పాలమూరు–రంగారెడ్డి’ని తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తోందని, ఇది ఆంధ్రప్రదేశ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ డి.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, అవ్వ వెంకటసుబ్బారెడ్డి, ఎస్‌కే.జానీబాషా, వజ్రాల కోటిరెడ్డి, నరబోయిన వెంకటరావు, సిద్దదాపు గాంధీ, గరికపాటి వెంకటరామనాయుడు, అన్నెం సోరెడ్డి, పండిపాటి వెంకయ్యలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది.  

అనుమతులు తీసుకున్నాకే... 
తెలంగాణ, ఏపీ, పిటిషనర్ల, కేంద్రం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ‘కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతించింది. అయితే ఇది ప్రాజెక్టు నిర్మాణానికి కాదని గుర్తుచేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణకు కేంద్రం సూచించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించలేదని.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కృష్ణా బోర్డు కూడా స్పష్టం చేసింది.

ఇవన్నీ ఇలా ఉన్నా.. తెలంగాణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. ఈ నిర్ణయం పర్యావరణంపై ప్రభావం చూపడంతోపాటు ఏపీ ప్రజలు, పిటిషనర్ల (రైతులు) ప్రయోజనాలపైనా ప్రభావం చూపుతుంది. చెంచు గిరిజనులు ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం(పంప్‌హౌస్‌) చేపట్టడానికి తెలంగాణకు అనుమతి లేదు. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తే ఇక సాగునీటికి కాలువలు తీయడం మినహా ఏమీ లేదు’అని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెబుతూ ఉత్తర్వులు జారీచేసింది.  
‘ఎన్జీటీ చట్టంలోని సెక్షన్‌ 14(3) ప్రకారం కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ జరిగిన ఆరు నెలల్లోనే పిటిషన్‌ దాఖలు చేయాలనడం వాస్తవమే, సెక్షన్‌ 15 ప్రకారం పిటిషన్‌ను పరిశీలించే అధికారం మాత్రం మాకుంది’ 

 ‘తెలంగాణ పేర్కొన్నట్లు 7.5 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా.. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కడుతున్నారంటే సాగునీటి అవసరాలకు కూడా అని భావిస్తున్నాం. పర్యావరణ అనుమతులు కూడా తాగునీటికే ఉన్నాయి.. సాగునీటికి కాదని కమిటీ స్పష్టం చేసింది’. 

​​​​​​​► ‘అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతితో పనులు చేపట్టాలి’ 
– పాలమూరు–రంగారెడ్డి కేసులో ఎన్జీటీ  

Advertisement
Advertisement