ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌  | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ 

Published Tue, Jan 30 2024 12:42 AM

Notification for Transco and Genco Director Posts: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా సంస్థ (టీఎస్‌ ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్‌ జెన్‌కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ట్రాన్స్‌కో డైరెక్టర్‌ (గ్రిడ్, ట్రాన్స్‌మిషన్‌), డైరెక్టర్‌(ఫైనాన్స్‌), డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) పోస్టులతోపాటు జెన్‌కో డైరెక్టర్‌ (జలవిద్యుత్‌), డైరెక్టర్‌ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ ఐఆర్‌), డైరెక్టర్‌ (కోల్‌–లాజిస్టిక్స్‌), డైరెక్టర్‌ (ఫైనాన్స్‌–కమర్షియల్‌) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖా స్తుదారుల వయసు 62 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1ని చివరి తేదీగా నిర్ణయించింది. త్వరలోనే డిస్కమ్‌ల డైరెక్టర్‌ పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. 
ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో డైరెక్టర్లుగా సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్‌ సర్వీస్, రిటైర్డ్‌ విద్యుత్‌ అధికారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. డైరెక్టర్ల నియమకానికి మార్గదర్శకాలను జారీ చేస్తూ 2012 మే 14న జారీ చేసిన జీవో 18 ప్రకారం.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్కో డైరెక్టర్‌ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్‌ లీస్టును రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.

ఈ కమిటీలో ఆయా విద్యుత్‌ సంస్థల సీఎండీలు కన్వీనర్లుగా, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వం నామినేట్‌ చేసే విద్యుత్‌రంగ ఇండిపెండెంట్‌ ఎక్స్‌పర్ట్‌ సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ సిఫారసు చేసిన షార్ట్‌ లిస్టు లోని ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకరిని డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

ఇక పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.. 
డైరెక్టర్‌ పదవి కాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలక్షన్‌ కమిటీ సిఫారసులతో మరో ఏడాది, ఆ తర్వాత కూడా ఇంకో ఏడాది పొడిగించడానికి వీలుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement