Our Country Indians Giving Up Their Citizenship And Taking Foreign Citizenship - Sakshi
Sakshi News home page

‘భారత్‌’తో బంధాన్ని తెంపేసుకుంటున్నారు. ఎందుకు వెళ్తున్నారు..? 

Published Mon, Jul 31 2023 1:38 AM

our country Indians giving up their citizenship and taking foreign citizenships - Sakshi

ఆదాయార్జన, మెరుగైన సేవలు,మరిన్ని సౌకర్యాలు, వాతావరణానికి,పరిస్థితులకు అలవాటు పడిపోవడం..కారణం ఏదైనా కావొచ్చు..వీటన్నిటినీ సానుకూల అంశాలుగానే భావించడం వల్ల అయ్యిండొచ్చు. ఏటా వేలు, లక్షల సంఖ్యలో భారతీయులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. విదేశాల్లో స్థిరపడిపోతున్నారు. ఆయా దేశాల పౌరులుగా మారిపోతున్నారు. అక్కడి పౌరసత్వం కోసం భారతీయ పౌరసత్వం వదులుకుంటున్నారు.

పుట్టి, పెరిగిన దేశంతో ఉన్న ‘బంధాన్ని’తెంపేసుకుంటున్నారు. దేశ పౌరుడిగా ఉన్న గుర్తింపునకు శాశ్వతంగా గుడ్‌ బై చెప్పేస్తున్నారు. ఇలా విదేశాల్లో పౌరసత్వం తీసుకుంటున్న వారిలో విద్యావంతులు, ధనికులు, విశేషాధికారాలను పొందుతున్న వారే ఎక్కువగా ఉండగా, ఇలా విదేశీ పౌరసత్వం తీసుకుంటున్నవారి సంఖ్య ఏటా పెరుగుతుండటం గమనార్హం. 

-సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ 

విదేశీ పౌరసత్వానికే ఓటు
గడిచిన పుష్కర కాలంలో ఏకంగా సుమారు 18 లక్షల మంది మన దేశ పౌరుని హోదాను వదులుకున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉన్న విధంగా భారత్‌లో ఉమ్మడి పౌరసత్వానికి ఆమోదం లేకపోవడంతో భారతదేశ పౌరసత్వాన్ని (సిటిజెన్‌షిప్‌) కాదనుకుని విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 135 దేశాల్లో అక్కడి సిటిజెన్‌ షిప్‌ తీసుకున్న భారతీయులు ఉన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా్నయి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారు ఉద్యోగం సంపాదించి ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతున్నారు.

వీరితో పాటు వర్క్‌ వీసాలపై వెళ్లేవారిలో ఎక్కువమంది భారత పౌరసత్వాన్ని వదులుకుని అక్కడి సిటిజెన్లుగా మారేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక దేశంలో అధిక ఆదాయం కలిగిన వారు, ఇతరులు కూడా విదేశాల్లో స్థిరపడే ఉద్దేశంతో భారత్‌ వదిలిపోతున్నారు. భారతదేశంలో అధిక ఆదాయం కలిగిన ఎనిమిది వేల మంది ఈ ఏడాది దేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌరసత్వం తీసుకోనున్నట్లు.. ‘గ్లోబల్‌ సిటిజెన్‌ షిప్‌ అండ్‌ రెసిడెన్స్‌ అడ్వాన్సెస్‌’పై అధ్యయనం చేసే లండన్‌లోని ‘హెన్లీ అండ్‌ పార్టనర్స్‌’అనే సంస్థ ఇటీవల వెల్లడించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 87 వేల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లారు.  

12 ఏళ్లలో 18.5లక్షల మందివెళ్లిపోయారు.. 
ప్రతి ఏడాదీ లక్షకు పైగా భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని పొందుతున్నారు. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. వీరిలో దాదాపు 60 శాతానికి పైగా ప్రజలు ఏడు దేశాల్లోనే పౌరసత్వం తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆ్రస్టేలియా, జర్మనీ, ఇటలీ వీటిల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో పాటు సింగపూర్‌లోనూ పౌరసత్వం తీసుకోవడానికి భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లకు వెళ్లే వారిలో గోవా, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, కేరళకు చెందినవారు ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడి పౌరసత్వం వదులుకునే క్రమంలో ఇచ్చే దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను బట్టి ఇది వెల్లడైంది.

ఎందుకు వెళ్తున్నారు..? 
విదేశీ పౌరసత్వం తీసుకుంటున్న వారిని ఏయే అంశాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయనేది పరిశీలిస్తే.. ప్రధానంగా భారత్‌లో కంటే మెరుగైన జీవన ప్రమాణాలు, సంపద, ఎక్కువ అవకాశాలు, తక్కువ కాలుష్యం, పిల్లలకు మంచి భవిష్యత్తు వంటివి కారణాలుగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆయారంగాల్లో విజయం సాధించిన వారు సైతం విదేశీ పౌరసత్వాన్ని కోరుకుంటున్నట్లు వెల్లడవుతోంది. వర్క్‌ వీసాలపై వెళ్లేవారు కూడా భారత్‌కు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అక్కడే పౌరసత్వం కోసం ప్రయతి్నస్తున్నారు. భారత్‌లో పన్నుల విధానం నచ్చని వారు.. తక్కువ ఆదాయ పన్ను వసూలు చేసే దేశాలవైపు మొగ్గు చూపుతున్నారు.

ఆయా దేశాల్లో ఎక్కువ నైపుణ్యం ఉన్న వారి కొరత.. భారతీయులకు అక్కడ శాశ్వత పౌరసత్వం కలి్పంచడానికి ఓ కారణంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఇక అధిక నెట్‌వర్త్‌ ఉన్న వ్యాపారవేత్తలు ఎక్కువగా దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, ఫ్రాన్స్, మాల్టా వంటి దేశాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఐరోపా దేశాల్లో డాక్టర్లు, నర్సులు, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫీ  షియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాలకు చెందిన ఐటీ ప్రొఫెషనల్స్‌తో పాటు వెల్డర్స్, ప్లంబర్స్, ఎల్రక్టీషియన్స్, కార్పెంటర్లకు డిమాండ్‌ బాగా ఉంది. వీరు కూడా అక్కడ పనిచేయడానికి వెళ్లి అక్కడి పౌరసత్వం పొందుతున్నారని చెబుతున్నారు.  

అమెరికా లేదా సింగపూర్‌ పౌరులైతే.. 
అమెరికా, సింగపూర్, జపాన్‌ దేశాల పౌరులైతే.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లడానికి వీసా ఇబ్బందులు పెద్దగా లేకపోవడం కూడా ఆయా దేశాల సిటిజన్లుగా మొగ్గుచూపడానికి ఓ కారణంగా చెబుతున్నారు. మన దేశం నుంచి అమెరికాకు పర్యాటక (టూరిస్ట్‌) వీసా మీద వెళ్లాలంటే.. ఆ వీసా స్లాట్‌ కోసమే దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. 

మళ్లీ భారత పౌరసత్వం కష్టమే..! 
భారత పౌరసత్వాన్ని వదులుకోవడం ఒకింత సులభమే అయినా, మళ్లీ భారత పౌరసత్వం పొందాలంటే మాత్రం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తుల కొనుగోలు, ఇతర అంశాల విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.  

దేశంలో సంపాదించి వెళ్లిపోయేవారు ప్రమాదం 
భారత్‌ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారందరిలో.. దేశంలోని అన్నిరకాల వనరులు ఉపయోగించుకుని బాగా సంపాదించాక ఆ డబ్బుతో యూఎస్, ఆ్రస్టేలియా, ఐరోపా దేశాల్లో పౌరసత్వం తీసుకుంటున్న వారిని అత్యంత ప్రమాదకారులుగా చూడాల్సి ఉంటుంది. ఉద్యోగం, విద్య, తదితర కారణాలతో విదేశాలకు వెళ్లిన వారు కొన్నేళ్లు పోయాక అక్కడే స్థిరపడడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వీరంతా వేరే కేటగిరీ కిందకు వస్తారు. ఇక్కడ సంపాదించిన దానికి ఆదాయపు పన్నులు కట్టకుండా ఎగ్గొట్టి ఇతర దేశాల్లో కంపెనీలు పెట్టడం, ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టి స్థిరనివాసం ఏర్పరుచుకోవడం వంటివి చేస్తున్నారు.

యూఎస్, యూకే తదితర దేశాలు.. ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో భాగంగా పరిశ్రమలు పెట్టినా, కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినా పౌరసత్వం ఇస్తున్నాయి. గుజరాత్, పంజాబ్‌లకు చెందిన కొన్ని ప్రాంతాలవారు యూఎస్, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లాలన్న లక్ష్యంతోనే ఉండడం గమనార్హం. యూఎస్‌లో గుజరాతీలు హోటల్‌ వ్యాపారంపై పట్టు సాధించగా, కెనడాలో పంజాబీలు వ్యవసాయంలో, వ్యాపారాల్లో స్థిరపడ్డారు.  
– ప్రొఫెసర్‌ డి.నర్సింహారెడ్డి,ప్రముఖ ఆర్థిక వేత్త, హెచ్‌సీయూ మాజీ డీన్‌  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement