Sakshi News home page

ప్రణీత్‌ రావు పిటిషన్‌.. తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

Published Wed, Mar 20 2024 4:29 PM

Phone Tapping Case:HC Reserves Verdict Of Praneeth Rao Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్యాపింగ్‌ కేసు నిందితుడు ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రణీత్‌ రావు పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే హైకోర్టు  ఆదేశాల మేరకు విచారణ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ శోభన్ హాజరయ్యారు.

హైకోర్టులో ప్రణీత్ రావు తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావును ఆక్రమంగా అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 వరకు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగాలి. కానీ అలా జరగడం లేదు. ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెక్‌అప్ చేయించాలి. కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెపుతున్నారు.కస్టడీ ఇప్పటికే నాలుగు రోజులు అయ్యింది. పోలీస్ స్టేషన్‌లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు’అని న్యాయవాది గం‍డ్ర మోహన్‌రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ‘24 గంటలు ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడీ లోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీడియా కు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. ప్రణీత్ రావు అరెస్ట్  13 మార్చిన మాత్రమే డీసీపీ ప్రెస్‌నోట్ ఇచ్చాడు. పోలీస్ అధికారులు మీడియాకు లీకులు ఇస్తారని చెప్పడం సరైంది కాదు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో ఐవో అధికారిగా ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ చేస్తున్నాం. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారు. ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయ్యడం కరెక్ట్ కాదు. ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి’అని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు  పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసినట్లు పేర్కొంది.

ట్యాపింగ్‌ కేసు నిందితుడు ప్రణీత్‌రావు.. కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని.. కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. అలాగే.. తనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పిటిషన్‌లో ఆరోపించారు.

Advertisement

What’s your opinion

Advertisement