జీవ ఇంధన వంగడాలపై దృష్టి పెట్టండి! | Sakshi
Sakshi News home page

జీవ ఇంధన వంగడాలపై దృష్టి పెట్టండి!

Published Sun, Feb 6 2022 4:07 AM

PM Modi Tastes Chana Directly From Farm During His Visit To Hyderabad ICRISAT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్టప్రాంతాల వారితోపాటు చిన్న, సన్నకారు రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు.. అధిక జీవ ఇంధనాలను అందించే వంగడాలు సృష్టించడంపై పరిశోధన చేయాలని శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘మెట్టప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌)’, భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కలిసికట్టుగా కృషిచేస్తే.. దేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కష్టమేమీ కాదన్నారు.

ఇక్రిశాట్‌ ఏర్పాటై యాభై ఏళ్లవుతున్న సందర్భంగా.. శనివారం పటాన్‌చెరులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వర్ణోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశంలో 80 శాతం వరకూ ఉన్న చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పా రు. పంట దిగుబడులు పెంచి, ప్రజలకు ఆహార భద్రత అందించడమే కాకుండా.. పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇక్రిశాట్‌ 50 ఏళ్లుగా భారత్‌తోపాటు ఆఫ్రికా ఖండంలోని మెట్ట ప్రాంత, చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు.. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తోందని కొనియాడారు.

వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త వంగడాల సృష్టికి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని శాస్త్రవేత్తలను కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న ఏడాదిలోనే ఇక్రిశాట్‌ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటోందని.. వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొనే సమయానికి ఇక్రిశాట్‌ 75 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని.. ఆ అమృత ఘడియలు ఇక్రిశాట్‌కు, భారత్‌కూ ఎంతో ముఖ్యమైనవని మోదీ పేర్కొన్నారు.

పామాయిల్‌ మిషన్‌తో తెలంగాణ, ఏపీలకు లాభం
వంట నూనెల రంగంలో ఆత్మనిర్భరత సాధించేం దుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. పామాయిల్‌ మిషన్‌ కింద దేశంలో పామాయిల్‌ సాగును 6.5 లక్షల హెక్టార్లకు పెంచేం దుకు ప్రయత్నిస్తున్నామని.. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండింటికీ ఎంతో లాభదాయకమైన విషయమని చెప్పారు. ఈ మిషన్‌ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే 25ఏళ్ల కోసం నిర్దేశించుకున్నట్టే.. ఇక్రిశాట్‌ కూడా కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటి సఫలీకృతం దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు.

నీటి, మట్టి నిర్వహణ, కొత్త వంగడాల అభివృద్ధి, యాజమాన్య పద్ధతుల్లో మార్పులు, రైతులను మార్కెట్‌తో అనుసంధానించడం వంటి పలు అంశాల్లో ఇక్రిశాట్‌ తీసుకున్న చర్యలు వ్యవసాయాన్ని లాభసాటిగా మా ర్చేందుకు సాయపడతాయన్నారు. ‘‘ఈసారి బడ్జెట్‌లో సహజ, డిజిటల్‌ వ్యవసాయాలకు పెద్ద ప్రాధాన్యం ఇచ్చాం. చిరుధాన్యాల సాగుకు ఊతమిస్తున్నాం. రసాయనాల్లేని వ్యవసాయానికి, సోలార్‌ పంపులు, డ్రోన్లను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయాన్ని ఆధునీకరిస్తున్నాం. ఆజాదీ కా అమృత్‌కాల్‌ కోసం మా దార్శనికతకు ఇది నిదర్శ నం. డిజిటల్‌ టెక్నాలజీలతో రైతు సాధికారత ఎలా కల్పించాలన్న అంశంపై నిరంతరం ప్రయత్నాలు సాగుతున్నాయి’’అని మోదీ వివరించారు.

లక్ష్యాలకు పునరంకితమవుతాం: ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌
చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రత్యేక వ్యవసాయ పరిశోధన కేంద్రం అవసరమని ఎంఎస్‌ స్వామినాథన్‌ వంటి శాస్త్రవేత్తలు చేసిన ఆలోచనల ఫలితమే ఇక్రిశాట్‌ అని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ జాక్వెలిన్‌ హ్యూగ్స్‌ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఐదు దశాబ్దాలు పనిచేస్తున్నామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయ డం మొదలుకొని అందరికీ చౌకగా పోషకాలతో కూడిన ఆహారం అందివ్వాలన్నది ఇక్రిశాట్‌ లక్ష్యమని.. ఆ దిశగా మరోసారి పునరంకితమవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రైతు సంక్షేమానికి కట్టుబడ్డాం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతుల సంక్షేమానికి కట్టుబడినదేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయ్యే నాటికి దేశంలో వ్యవసాయం ఎలా ఉండాలనేందుకు ఈ బడ్జెట్‌ ద్వారా పునాది పడిందన్నారు. జైజవాన్, జైకిసాన్‌ అని ఒకప్పుడు నినాదమైతే.. వాజ్‌పేయి జైవిజ్ఞాన్‌ను జోడించారని, తాజాగా మోదీ ‘జై అనుసంధాన్‌ (పరిశోధనలు)’ను కూడా చేర్చారని వివరించారు. మోదీ కార్యక్రమాలన్నిం టినీ విశ్లేషిస్తే.. దేశ అభ్యున్నతికి పరిశోధనలు ఎంత అవసరమో చెప్పేవిగానే ఉంటాయన్నా రు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పంట లపై దుష్ప్రభావం తక్కువగా ఉండేలా చేసేం దుకు ఇక్రిశాట్‌ కృషి చేస్తోందని అన్నారు. 

Advertisement
Advertisement