మరో 4 వేల సీట్లు! | Sakshi
Sakshi News home page

మరో 4 వేల సీట్లు!

Published Mon, Feb 26 2024 4:37 AM

Possibility of increase in seats in IITs and NITs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లో ఇంజనీరింగ్‌ సీట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. 3 వేల నుంచి 4 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్‌ ఒకరు తెలిపారు.

సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పు జరిగి చేరికల్లో ఎక్కువ మందికి చాన్స్‌ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే  సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. దీంతో ఆన్‌లైన్‌ కోర్సుల నిర్వహణ ద్వారా ఐఐటీలు కొంతమేర నిధులు సమకూర్చుకునే ప్రతిపాదన ముందుకు వస్తోంది.

కంప్యూటర్‌ కోర్సులకు డిమాండ్‌ నేపథ్యంలో..
దేశంలో కంప్యూటర్‌ నేపథ్యం ఉన్న కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీల దృష్ట్యా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు ఎన్‌ఐటీలు, ఐఐటీల్లోనూ కంప్యూటర్‌ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జేఈఈలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్‌ కోర్సులనే మొదటి ఆప్ష¯న్‌గా పెట్టుకుంటున్నారు.

మరోవైపు నైపుణ్యంతో కూడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కొరత ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సదస్సులోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీలు సైతం కంప్యూటర్‌ కోర్సుల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బొంబయి ఫస్ట్‌..ఢిల్లీ, మద్రాస్‌ నెక్‌స్ట్‌
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బొంబయి ఐఐటీకి ప్రతి ఏటా డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. ఈ ఐఐటీని జేఈఈ అడ్వాన్స్‌డు ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ ఐఐటీ ఉంటోంది.

గత ఏడాది ముంబై ఐఐటీలో ఓపె¯న్‌ కేటగిరీలో బాలురైతే 67, బాలికలైతే 291వ ర్యాంకు వరకు సీటు కేటాయింపు జరిగింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది. ఇక విద్యార్థులు అంతగా  ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో భిలాయ్‌ ఐఐటీ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది.

ఎన్‌ఐటీల్లోనూ అవకాశాలు
దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు పెరిగితే ఎన్‌ఐటీల్లోనూ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల మెరుగైన ర్యాంకులు పొందినవారు ఐఐటీలో చేరుతారు. మరోవైపు ఎన్‌ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని, ఎక్కువమందికి సీట్లు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

2022లో వరంగల్‌ ఎన్‌ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే, 2023లో బాలురకు 3115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుందంటున్నారు. తిరుచిరాపల్లి ఎన్‌ఐటీలో బాలురకు 2022లో 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోయాయి. గత ఏడాది మాత్రం బాలురకు 1509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్‌ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్‌ సైన్స్‌నే ఎంచుకున్నారు.

రెండో ప్రాధాన్యతగా కూడా 80 శాతం ఇదే బ్రాంచ్‌ ఉండటం విశేషం. గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్‌ఐటీలో సీఎస్‌సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకు ఓపెన్‌ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయో టెక్నాలజీలో 48 వేల వరకు సీటు వచ్చింది.  

Advertisement
Advertisement