RFCL: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. 5 రాష్ట్రాలకు బాసట.. సగం వాటా తెలంగాణకే | Sakshi
Sakshi News home page

RFCL: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. 5 రాష్ట్రాలకు బాసట.. సగం వాటా తెలంగాణకే

Published Fri, Nov 11 2022 9:16 PM

Ramagundam: PM Modi to Dedicate RFCL To Nation On Saturday - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ సిగలో మరో మణిహారంగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అడుగడుగునా ఏర్పడిన అవాంతరాలను అధిగమిస్తూ పునరుద్ధరించిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ జోరుగా ఉత్పత్తి కొనసాగిస్తూ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల రైతులకు బాసటగా నిలుస్తోంది.

దేశీయంగా ఎరువుల ఉత్ప­త్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారాన్ని కేంద్రప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) పేరుతో పునరుద్ధరించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ చేతులమీదుగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక గత మార్చి 22 నుంచి వాణిజ్యకార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్పత్తిలో సగం వాటా తెలంగాణ రాష్ట్ర అవసరాలకే కేటాయించనున్నారు. 

వేప నూనె, విదేశీ సాంకేతికతతో..
వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రాజెక్టు విలువ రూ.6,338.16 కోట్లు కాగా, వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.75 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అమ్మోనియాను డెన్మార్క్‌ దేశానికి చెందిన హల్టోర్‌ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేయ్‌ కంపెనీ సాంకేతిక  పరిజ్ఞానంతో తయారుచేస్తోంది. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేసి, వేపనూనెతో యూరియా, అమ్మోనియా తయారుచేయడం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రత్యేకత.  
చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే..!

Advertisement
Advertisement