నాంపల్లి, యాదాద్రి రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి షురూ | Sakshi
Sakshi News home page

నాంపల్లి, యాదాద్రి రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి షురూ

Published Mon, Aug 7 2023 3:28 AM

Redevelopment of Nampally and Yadadri railway stations has started - Sakshi

సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: నిజాంకాలం నాటి చారిత్రక నాంపల్లి రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద సుమారు రూ.309 కోట్ల నిధులతో చేపట్టిన నాంపల్లి రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌కు ప్రధాని లాంఛనంగా పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్, సికింద్రాబాద్‌ డివిజనల్‌ అధికారి భరతేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ, అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 12 కొత్త ప్రాజెక్టులకు రైల్వేశాఖ రూ. 8,494 కోట్లు మంజూరుచేసిందని చెప్పారు. త్వరలో రూ.350 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే మరో రూ.300 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రూ.700 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మూడేళ్లలో అధునాతన సికింద్రాబాద్‌ స్టేషన్‌ వినియోగంలోకి వస్తుందన్నారు చర్లపల్లి స్టేషన్‌ అభివృద్ధి, విస్తరణ తుది దశకు చేరుకుందని, 2024లో సేవలు ప్రారంభమవుతాయని కిషన్‌రెడ్డి చెప్పారు. 

ఆర్టీసీ విలీనం చేయాల్సిందే కానీ... 
ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అందుకోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. ఆర్టీసీకి ఉన్న రూ.వేల కోట్ల విలువైన స్థలాలను కాజేసేందుకే ఆగమేఘాల మీద విలీనం చేస్తున్నట్లుగా తెలుస్తోందని ఆరోపించారు.

రూ.25.24 కోట్లతో యాదాద్రి స్టేషన్‌ అభివృద్ధి 
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయిగిరిలోని యాదాద్రి రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.25.24 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని చిత్ర పటానికి భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పాలాభిషేకం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement