పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ | Sakshi
Sakshi News home page

పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ

Published Thu, Jan 11 2024 4:22 AM

Reduce plastic use in forestry programs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ అని, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హరితహారంపై ఇప్పటివరకు జరిగిన పురోగతి, రానున్న సీజన్‌ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆమె సచివాలయంలో సమీక్షించారు. అటవీ, గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హార్టికల్చర్‌ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటుతున్న మొక్కలు, వాటి ఎదుగుదల, అలాగే చనిపోయిన మొక్కలను మార్చే విధానంపై వివరాలన్నీ వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇంటి అవసరాలకు ఉపయోగకరమైన, అలాగే కనీస ఆదాయాన్నిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పూలు, పండ్ల జాతుల మొక్కల పంపిణీతో పాటు, స్వచ్ఛందంగా పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

తమ ఇంటి ఆవరణలో చెట్లు నాటుకున్న వాళ్లకు కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. చింత, సీతాఫల్, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు లాంటి మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. హరితహారం కార్యక్రమం పారదర్శకంగా, పూర్తి జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకోవాలని మంత్రి అన్నారు.  

ఫారెస్టు అధికారులపై దాడులు చేస్తే కఠినచర్యలు 
భద్రాద్రి జిల్లా ఇల్లెందు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్టు అధికారులపై దాడులు చేయడాన్ని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. మంగళవారం జరిగిన దాడిపై విచారణకు ఆదేశించారు. అటవీ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్న ఫారెస్టు అధికారులపై ట్రాక్టర్‌ను ఎక్కించి చంపడానికి దుండగులు చేసిన ప్రయత్నంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా రు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. 

Advertisement
Advertisement