Sakshi News home page

టీ–శాట్‌ సేవలు 90 లక్షల మందికి

Published Fri, Jul 28 2023 2:57 AM

T SAT services for 90 lakh people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణకు ముందు ‘మన టీవీ’ పేరిట కొన్ని ఇళ్లు, సంస్థలకే పరిమితమైన టీ–శాట్‌ సేవలు.. ప్రస్తుతం 90 లక్షల మందికి అందుతున్నాయనిఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యార్థులు, యువతకు అవసరమైన సేవలకోసం ప్రణాళికాబద్ధంగా, ఆచరణాత్మక విధానాలతో టీ–శాట్‌ కార్యక్రమాలు రూపొందుతున్నట్టు వెల్లడించారు.

అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఆవరణలో గురువారం జరిగిన టీ–శాట్‌ ఆరో వార్షికోత్సవంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డిజిటల్‌ మాధ్యమాల ద్వారా కూడా సేవలు అందించేందుకు పదివేల గంటలకు పైగా కూడిన కంటెంట్‌తో ప్రత్యేక యాప్‌ తయారు చేసినట్టు వెల్లడించారు. దీంతో లక్షలాది డౌన్‌లోడ్‌ల ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకునే పద్ధతులు వేగంగా మారుతున్నాయన్నారు.

మారుతున్న బోధన, అభ్యసన ధోరణులకు అనుగుణంగా కంటెంట్‌ రూపకల్పనలో టీ–శాట్‌ మార్పులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీశాట్‌ సీఈఓ శైలేష్‌రెడ్డి,  ఉస్మానియా, అంబేడ్కర్‌ వర్సిటీల వీసీలు రవిందర్‌యాదవ్, సీతారామారావు పాల్గొన్నారు.  

కంటెంట్‌ రూపకల్పన కోసం ఉస్మానియావర్సిటీతో టీ–శాట్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకు న్నట్టు కేటీఆర్‌ వెల్లడించారు. ఓయూ ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్స హించాలని సూచించారు. ఈ ఒప్పందం ద్వారా వర్సిటీ పరిధిలోని 720 అనుబంధ కాలేజీలకు చెందిన సుమారు మూడు లక్షల మంది విద్యార్థులకు టీ–శాట్‌ నెట్‌వర్క్‌ ద్వారా పాఠాలు అందుతాయి

ఆహాలోనూ టీ–శాట్‌: ఆహా ఓటీటీ వేదిక ద్వారా టీ–శాట్‌ ప్రసారానికి కూడా ఒప్పందం కుదిరింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా టీ–శాట్‌ ప్రసారాలు వీక్షకులకు అందుతాయని ఆహా టీవీ సీఈఓ రవికాంత్‌ సబ్నవీస్‌ ప్రకటించారు. 

Advertisement

What’s your opinion

Advertisement