క్రమశిక్షణతోనే  ఆరోగ్య జీవనం | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతోనే  ఆరోగ్య జీవనం

Published Sun, Nov 28 2021 2:09 AM

Telangana: Venkaiah Naidu Speech For Healthy Living With Discipline - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అలాంటి జీవనశైలిని అనుసరించిన వారే ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందుతారని చెప్పారు. కోవిడ్‌–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ పెరిగిందని, ఆరోగ్యకర జీవితాన్ని గడపడానికి కచ్చితమైన మార్గం క్రమశిక్షణే అని అన్నారు. వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

శనివారం యశోద హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ బ్రాంకస్‌–21 అంతర్జాతీయ వార్షిక సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మన ఆరోగ్య వ్యవస్థలు, మౌలిక వసతుల సదుపాయాల విషయంలో కోవిడ్‌–19 అనేక పాఠాలను నేర్పింది. ఫ్రంట్‌లైన్‌ యోధులు అంకితభావంతో పనిచేసి కోవిడ్‌–19పై యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు. మనం పీల్చేగాలి మన ఆరోగ్యం, శ్రేయస్సును నిర్ణయిస్తుందనే విషయాన్ని కరోనా వైరస్‌ గుర్తు చేసింది. ఇంటి నిర్మాణంలో గాలి, వెలుతురు బాగా వచ్చే విధానంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

పురాతన పద్ధతులను అనుసరించి సహజ కాంతితో ఉండేలా చూసుకోవాలి. కరోనా వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తులకు సోకుతుండటంతో శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న విషయాన్ని గుర్తు చేసింది’అని వెంకయ్య చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ దేశంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోగ నిర్ధారణ ప్రక్రియలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. మంచి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు యోగా, సైక్లింగ్‌ వంటి శారీరక శ్రమ చేయడంపై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు.    

Advertisement
Advertisement