TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్‌? | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్రాఫిక్ చలానాల రాయితీ?.. ఈసారి న్యూఇయర్‌ కానుకగా భారీగా..

Published Fri, Dec 22 2023 8:50 AM

TS Traffic Challans: Discount to clear pending challans Again - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లను వసూలు చేసేందుకు గతంలో చేపట్టిన కార్యాచరణను మరోసారి అమలు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో అతిత్వరలో చలాన్లపై రాయితీల ప్రకటన అధికారికంగా చేయనుంది. అయితే ఈసారి ఆ రాయితీలు భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. 

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా.. చిన్నచిన్న పట్టణాల స్థాయి దాకా  ఉల్లంఘనకు ఛలాన్ల విధింపు ఉంటోంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ పని మరింత సులభతరం అయ్యింది. అయినా కూడా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్‌ చలాన్ల సంఖ్య పెరిగిపోతోంది. 


నవంబర్‌ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్‌ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని.. అదీ కొత్త ఏడాది కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో పోలీస్‌ శాఖ ఉన్నట్లు సమాచారం. న్యూఇయర్‌కి.. కుదరకుంటే జనవరి చివరకు దీనిపై ప్రకటన చేయొచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి.

గతంలో.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి.

ఇదీ చదవండి: వైన్‌ షాపులు.. కావవి బార్లు!

Advertisement
Advertisement