తెలంగాణ: ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌

13 Mar, 2023 16:08 IST|Sakshi

ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌:

► మహాబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 16వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది.

► మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్  టీచర్ ఎమ్మెల్సీ  పొలింగ్ పర్సంటేజ్.. మధ్యాహ్నం  2:30 గంటల వరకు ( 77.11%), ఇబ్రహీంపట్నం మండలం పోలింగ్ 155 (76.32%), మంచాల మండలం పోలింగ్  53 (85.48%), యాచారం మండలం పోలింగ్  65 (77.64%) గా నమోదు అయ్యింది.

►మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్ ఉదయం 10 గంటల వరకు 19.54 శాతం నమోదైంది. ఇ​క జిల్లాల వారిగా చూస్తే.. మహబూబ్ నగర్ జిల్లా 19.30 శాతం, నాగర్ కర్నూల్ జిల్లా 19.20 శాతం, వనపర్తి జిల్లా 25.69 శాతం, గద్వాల్ జిల్లా 21.78 శాతం, నారాయణపేట్ జిల్లా 20.33 శాతం, రంగారెడ్డి జిల్లా 15.20 శాతం, వికారాబాద్ జిల్లా 16.19 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 17.21 శాతం, హైదరాబాద్ జిల్లా 21.00 శాతం నమోదైంది. 

హైదరాబాద్‌–రంగారెడ్డి, మహ­­బూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 29,720 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 15,472, మహిళలు 14,246, ఇతరులు ఇద్దరు ఓటర్లు ఉన్నారు. 137 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. టీచర్లు వివిధ ప్రాంతాలకు బదిలీ అవ్వడంతో కొంతమందికి రెండుచోట్ల ఓట్లున్నట్టు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తడంతో అధికారులు వాటిని తొలగించారు. 

► అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్‌ కొనసాగుతోందని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.

ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికర పరిస్థితి
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లు, బదిలీలు, పదోన్నతులపై ఆశలు సన్నగిల్లిన టీచర్లను సంతృప్తిపర్చడం ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికరంగా మారింది. టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి 2017 ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీపడగా ఈసారి 21 మంది బరిలో ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు.

ఆయన గత ఎన్నికల్లో పీఆర్‌టీయూటీఎస్‌ మద్దతుతో గెలవగా, ఈసారి పీఆర్‌టీయూ తెలంగాణ మద్దతుతో పోటీ చేస్తున్నారు. పీఆర్‌టీయూటీఎస్‌ ఈసారి గుర్రం చెన్నకేశవరెడ్డిని బరిలోకి దించింది. వీరిద్దరి మధ్య ఓట్ల విభజన ఎలా ఉంటుందనేది కీలకం. తెలంగాణ యూటీఎఫ్‌ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఏవీఎన్‌ రెడ్డిని బీజేపీ అనుకూల సంఘాలు బలపరుస్తున్నా యి.

సీపీఐ అనుబంధ సంఘం ఎస్‌టీయూటీఎస్‌ అభ్యర్థిగా బి.భుజంగరావు, టీపీటీఎఫ్, బీఎస్పీ మద్దతుతో ఆచార్య వినయ్‌బాబు, బీసీటీఏ నుంచి విజయకుమార్‌ పోటీచేస్తున్నారు. టీయూటీఎఫ్‌ మద్దతులో మల్లారెడ్డి, జీటీఏ సహకారంతో ప్రభాకర్, లోకల్‌ కేడర్‌ జీటీఏ మద్దతుతో రవీందర్‌ పోటీలో ఉన్నారు. కాటేపల్లి జనార్దన్‌ రెడ్డికి అప్పట్లో టీఆర్‌ఎస్‌ మద్దతు తోడైంది. ఈసారి అధికార పార్టీ తో సంబంధం లేకుండా ప్రచారం నిర్వహించారు.  

ఆఖరి వరకూ ప్రచారం: ప్రచారంలో అన్ని పక్షాలూ ఉపాధ్యాయ సంఘాలు ఓట్లున్న ప్రతీ స్కూల్, కాలేజీకి వెళ్లాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించాయి. మూడు నెలలుగా అభ్యర్థులు వారి వ్యూహాల్లో మునిగి తేలుతున్నా, ఆఖరి మూడురోజుల్లో మాత్రం పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు డబ్బులు కూడా పంచినట్టు కొందరు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు