వరుసకు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో... | Sakshi
Sakshi News home page

వరుసకు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో...

Published Mon, May 8 2023 2:10 AM

- - Sakshi

సాక్షి, తిరుపతి: తమకు ఇష్టంలేని పెళ్లి చేస్తారేమోనని వరుసకు అక్కాచెల్లైళ్లెన ఇద్దరు యువతులు ఆదివారం కూల్‌డ్రింక్‌లో విషపుగుళికలు కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వీరిలో ఒకరు నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన మండలంలోని తిమ్మాజికండ్రిగ గ్రామంలోని స్వర్ణముఖి నది కాజ్‌ వద్ద చోటు చేసుకుంది. నాయుడుపేట సీఐ నరసింహరావు తెలిపిన వివరాల మేరకు.. ఓజిలి మండల, కొత్తపేట గ్రామానికి చెందిన ముమ్మడి సుబ్బయ్య, కస్తూరమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పెద్ద కుమార్తె సుప్రియకు వివాహంకాగా రెండో కుమార్తె రజిత నాయుడుపేట పట్టణంలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ... కొత్తపేటలో వలంటీర్‌గా పనిచేస్తోంది. ఇదిలావుండగా.. కొత్తపేట మాజీ సర్పంచ్‌ బట్టా సురేష్‌, వీరమ్మ దంపతులకు కుమారుడు పూర్ణచంద్ర, కుమార్తె నీరజ ఉన్నారు. నీరజ బీటెక్‌ చదివి ఇంట్లోనే ఉంటోంది. రజిత, నీరజ ఇద్దరూ చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. వరుసకు అక్కాచెల్లెళ్లు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని వీరికి సంబంధాలు చూస్తున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేస్తారేమోనని అక్కాచెల్లెళ్లు క్షణికావేశానికి లోనయ్యారు. ఆదివారం స్కూటీ డ్రైవింగ్‌ నేర్చుకుంటామని చెప్పి నాయుడుపేట వైపు వచ్చారు. వారి వెంట విషపు గుళికలు ఉన్న డబ్బాతోపాటు కూల్‌డ్రింక్‌ తెచ్చుకున్నారు.

తిమ్మాజికండ్రిగ గ్రామ సమీపంలో స్వర్ణముఖి నది కాజ్‌ వే వద్ద ఇద్దరు కూల్‌డ్రింక్‌లో విషపు గుళికలు కలుపుకుని సేవించి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి సమాచారం అందించారు. వారు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే స్వర్ణముఖి కాజ్‌ వే సమీపంలో అపస్మారకస్థితిలో పడి ఉన్న ఇద్దరు యువతులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. చికిత్స పొందుతూ రజిత(21) మృతువాత పడింది. నీరజ పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. రజిత మృతి పట్ల ఓజిలి ఎస్‌ఐ ఆదిలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

Advertisement
Advertisement