విశాఖ విమానాశ్రయానికి పెరుగుతున్న రద్దీ | Sakshi
Sakshi News home page

విశాఖ విమానాశ్రయానికి పెరుగుతున్న రద్దీ

Published Tue, Sep 5 2023 1:18 AM

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. ప్రయాణికుల రద్దీతో కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి చేరుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఈ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 10,37,710 మంది ప్రయాణికులు (దేశీయ, అంతర్జాతీయ) రాకపోకలు సాగించారు. గత సంవత్సరం ఏప్రిల్‌–జూలై మధ్య నాలుగు నెలల్లో 7,75,100 మంది ప్రయాణించారు. వీరిలో దేశీయ ప్రయాణికులు 7,54,966 మంది, విదేశీ ప్రయాణికులు 20,084 మంది ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు చూస్తే దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారు 10,13,518కి, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులు 24,192కి పెరిగారు.

అలాగే దేశీయ (డొమెస్టిక్‌) విమానాల రాకపోకలు కూడా 7,045 నుంచి 7,184కి పెరిగాయి. అయితే రాకపోకలు సాగించిన అంతర్జాతీయ విమాన సర్వీసులు 170 నుంచి 164కి స్వల్పంగా తగ్గాయి. కానీ ఈ నాలుగు నెలల్లో అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించింది. కోవిడ్‌కు ముందు ఈ విమానాశ్రయం నుంచి నెలకు సగటున 2.8 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కోవిడ్‌ తర్వాత రెండేళ్ల పాటు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నెలకు 1.5 లక్షల మంది ప్రయాణించడం గగనమయ్యేది.

మళ్లీ కొన్ని నెలల నుంచి ఈ ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటోంది. ఇప్పుడది నెలకు 2.6 లక్షలకు పెరిగింది. మరికొద్ది నెలల్లో ఈ సంఖ్య కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ ఎయిర్‌పోర్టు ఏడాదికి 3.5 మిలియన్ల ప్రయాణికులు రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మున్ముందు ఈ ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్‌ ఎస్‌.రాజారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సౌకర్యాలను పెంచుతున్నామని తెలిపారు.

కార్గో రవాణాలోనూ..
మరోవైపు కార్గో రవాణాలోనూ ఈ విమానాశ్రయం ఊపందుకుంటోంది. కోవిడ్‌ ప్రభావంతో రెండేళ్లకు పైగా కార్గో రవాణా సన్నగిల్లింది. కానీ కొన్నాళ్లుగా ఇది మళ్లీ పుంజుకుంటోంది. కోవిడ్‌ సమయంలో రోజుకు ఏడెనిమిది టన్నుల సరకు రవాణా కష్టతరమయ్యేది. ఇప్పుడు రోజుకు 12 నుంచి 15 టన్నుల వరకు కార్గో రవాణా జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఈ ఎయిర్‌పోర్టు నుంచి 1,432 టన్నుల సరకు రవాణా జరిగింది. ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రొయ్యలు, రొయ్య పిల్లలతో పాటు ఫార్మా ఉత్పత్తులు, అత్యవసర మందులు, దుస్తులు, ఆటోమొబైల్స్‌, నావికాదళానికి సంబంధించిన వస్తువులు, సరకులు, పరికరాలతో పాటు సాధారణ సరకు రవాణా కూడా జరుగుతోంది. వీటిలో రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులు, దుస్తులు ఎక్కువగా రవాణా అవుతుంటాయి.

Advertisement
Advertisement