కులగణనకు సహకరించాలి | Sakshi
Sakshi News home page

కులగణనకు సహకరించాలి

Published Tue, Nov 21 2023 1:20 AM

రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజ్‌  - Sakshi

భీమవరం: అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ నెల 27 నుంచి జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర కుల గణన సర్వేకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని శాసన మండల చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజ్‌ అన్నారు. భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో సోమవారం సమగ్ర కుల గణన సర్వేపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజ్‌ మాట్లాడారు. దేశంలో చివరి సారిగా 1931లో కులగణన జరిగిందని, శతాబ్ద కాలం తరువాత బిహార్‌ తరువాత రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే సమగ్ర కుల గణన జరిపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఇది కేవలం సర్వే మాత్రమే అన్నారు. ఈ సమాచారం ఆధారంగా కుల ధ్రువపత్రాలు జారీ చేయరని, ఎప్పటిలాగే తహసీల్దారు పరిశీలనతోనే కుల ధ్రువీకరణ పత్రాల జారీ కొనసాగుతుందన్నారు. సభలో చర్చించిన విషయాలపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఎవరికై నా సందేహాలు ఉంటే మండల, జిల్లా స్థాయి అధికారులను సంప్రదించవచ్చని చెప్పారు. ఈ నెల 27 నుంచి వారం పాటు ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

ఎస్సీ కమిషన్‌ సభ్యులు చెల్లెం ఆనంద్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ కుల గణన చేపట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. దీనివల్ల అట్టడుగున ఉన్న ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెండ్ర వీరన్న మాట్లాడుతూ సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ప్రణాళికలు, వ్యూహాల రూపకల్పనకు జనాభాలోని అన్ని కులాల సమాచార సేకరణ అవసరమని చెప్పారు. తొలుత జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి శ్రీనివాసరావు సమగ్ర కుల గణన కార్యక్రమం అవశ్యకత, నిర్వహించే విధానం గురించి వివిధ కులాల, వర్గాల ప్రతినిధులగా హాజరైన వారి సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, మాల మహానాడు రాష్ట్ర చీఫ్‌ కార్యదర్శి రాజారావు, వెలమ కమిషన్‌ సభ్యుడు గూడూరు శ్రీనివాస రావు, సగర కార్పొరేషన్‌ మెంబర్‌ కె.కర్ణయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement