ఉదారంగా పంట నష్టం అంచనాలు | Sakshi
Sakshi News home page

ఉదారంగా పంట నష్టం అంచనాలు

Published Sun, Dec 10 2023 12:30 AM

అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కారుమూరి   - Sakshi

తణుకు అర్బన్‌: పంట బాగా పండి చేతికొచ్చే వేళ మిచాంగ్‌ తుపాను రైతులను దెబ్బతీసిందని, పంట నష్టం అంచనా వేసే క్రమంలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం తణుకు నియోజకవర్గ పరిధిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసి డబ్బులు ఖాతాల్లో వేయాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. పంట నష్టం అంచనా వేసే సమయంలో రైతులకు మేలు చేసేలా వ్యవహరించాలన్నారు. పంట కోత ప్రయోగాలు పూర్తయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుందని, కోతలు పూర్తికాని పంట ఉంటే బీమా వర్తింపజేసేలా చూడాలని ఆదేశించారు. రైతులు సమీపంలోని మిల్లులకు ధాన్యం తరలించవచ్చని, రైసుమిల్లర్లు ఇబ్బంది పెడితే ఉపేక్షించమని హెచ్చరించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకు రూ.17 వేలతోపాటు బీమా కూడా రాజీ లేకుండా చేయిస్తామని స్పష్టం చేశారు.

80 శాతం రాయితీతో విత్తనాలు

నారుమడులు దెబ్బతిన్న రైతులకు 80 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి కారుమూరి చెప్పారు. చంద్రబాబు హయాంలో తుపాన్లు ఏర్పడ్డ సమయంలో నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం ఉండేదని, అయితే సీఎం జగన్‌ తుపాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు అందించారన్నారు. మురుగు, పంట కాలువలు, డ్రెయిన్ల అభివృద్ధికి అధికారులు ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగా టెండర్‌ ప్రక్రియలు పూర్తిచేయాలన్నారు. తణుకు నియోజకవర్గంలో 29,500 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందులో ఆఫ్‌లైన్‌ సేకరించింది 8 వేల టన్నుల వరకు ఉందన్నారు. సివిల్‌ సప్లయీస్‌ డీఎం టి.శివరామప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, ఇరిగేషన్‌ ఈఈ దక్షిణమూర్తి రైతులు, నాయకుల సందేహాలను నివృత్తి చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ బీవీ రమణ, అత్తిలి ఏఎంసీ చైర్మన్‌ బుద్దరాతి భరణిప్రసాద్‌, ఎంపీపీ ఆర్‌.ధనరాజు, అత్తిలి జెడ్పీటీసీ అడ్డాల జానకి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, తణుకు, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్‌, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పెన్మెత్స సుబ్బరాజు, ఇల్లింద్రపర్రు సొసైటీ అధ్యక్షుడు మల్లిరెడ్డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Advertisement
Advertisement