పుట్టా...పుత్తాకు ఝలక్‌... ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికే | Sakshi
Sakshi News home page

పుట్టా...పుత్తాకు ఝలక్‌... ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికే

Published Wed, Jun 7 2023 11:38 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: యువగళం పాదయాత్రలో టీడీపీ సీనియర్లకు నారా లోకేష్‌ షాక్‌ ఇస్తున్నారు. ఒకవైపు పార్టీ టికెట్లు ఇచ్చేది చంద్రబాబే అని అంటూనే, పరోక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో ఇన్‌చార్జిల అభ్యర్థిత్వాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా, మైదుకూరు, కమలాపురం అభ్యర్థిత్వాలపై నర్మగర్భంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా ఈవినింగ్‌ వాకింగ్‌ను తలపించేలా యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నిత్యం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై పరిస్థితి బట్టి రాత్రి 11 గంటల లోపు ముగుస్తోంది. జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని భావిస్తే, అలాంటి వారు తప్పులో కాలేసినట్లే. యువగళం చెంతకు టీడీపీ కేడర్‌ మినహా, ప్రజలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు సమీకరించిన కేడర్‌తో ముఖాముఖీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదీ కూడా కులాలు ఆధారంగా చేపడుతూ సాగుతున్నారు.

పాదయాత్ర అంటే ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని ఆయా సమస్యలను ఎక్స్‌ఫోజ్‌ చేయడం ఆనవాయితీగా చూశాం. నాలుగు దశాబ్దాలుగా ఇలాంటి పాదయాత్రనే ప్రజానీకం గమనించింది. కాగా నారాలోకేష్‌ పాదయాత్ర అందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ప్రతిరోజూ ఈవినింగ్‌ వాకింగ్‌లా సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈలోపు స్థానికంగా టీడీపీ నాయకులు సమీకరించిన జనాలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదీకూడా ప్రణాళిక బద్ధంగా కులాలు ఆధారంగా చేపడుతుండడం విశేషం. టీడీపీ కేడర్‌తోనే చిలుక పలుకులు చెప్పించడం, ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నిందిస్తూ నారా లోకేష్‌ ప్రసంగించడం. ముందస్తుగా రచించిన వ్యూహం ప్రకారం యువగళం పాదయాత్ర చేపట్టడం మినహా వాస్తవికత ఆధారంగా చేపట్టడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

మదనపడుతోన్న సీనియర్లు...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆ పార్టీ సీనియర్లను మదనపెడుతోంది. జిల్లాలో చోటుచేసుకున్న పరిణామం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జమ్మలమడుగులోకి ప్రవేశించిన ఆయన ‘లోకేష్‌–భూపేష్‌’ జోడి అదిరింది కదూ, అంటూనే అక్కడి కేడర్‌కు భూషేష్‌ అభ్యర్థిత్వంపై గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రొద్దుటూరుకు వచ్చే కొద్ది ప్రవీణ్‌కుమార్‌రెడ్డికే టికెట్‌ అని లోకేశ్‌ పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ‘ప్రొద్దుటూరు పౌరుషాన్ని నిలబెట్టింది ప్రవీణ్‌. మీ తరపున పోరాడినందుకు 29 రోజులు జైలుకెళ్లింది ఈ ప్రవీణ్‌ (అతన్ని చూపుతూ) అంటూ ఆకాశానికెత్తారు. లోకేష్‌ మాటలతో అదే వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, టీడీపీ నేత పోట్లదుర్తి సురేష్‌నాయుడు మొహాల్లో నెత్తురు చుక్కలేదు. మా సహకారం లేకుండా ఏజెంట్లను కూడా పెట్టుకోలేని ప్రవీణ్‌ను అభ్యర్థిగా ప్రకటించడం ఏమిటి, ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలు సన్నిహితుల వద్ద వాపోతుండడం విశేషం.

యువగళం విజయవంతం కోసం....
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా యువగళం విజయవంతం కోసం టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. నారా లోకేష్‌ కటౌట్లు పెట్టించడం నుంచి పబ్లిక్‌ను చూపించడం వరకూ తంటాలు పడుతున్నారు. ఈపరిస్థితుల్లో బయటి ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు పెట్టి ప్రజానీకాన్ని కడపకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఆపై పసుపు కండువాలు వారి చేతికి అప్పగించి, నిర్ణయించిన ప్రాంతంలో లోకేష్‌ పర్యటన కంటే ముందే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం పార్టీ టికెట్‌ ఆశిస్తున్న ఆశావాహులు నిర్వహిస్తుండడం విశేషం.

పుట్టా...పుత్తాకు ఝలక్‌
మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో కొనసాగిన యువగళం యాత్రకు అక్కడి ఇన్‌ఛార్జిలు పుట్టా సుధాకర్‌యాదవ్‌, పుత్తా నరసింహారెడ్డిలు కృషి చేశారు. కాగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో లాగా ఇక్కడ కూడా ఆ ఇరువురి నేతల అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇస్తారని ఆశించారు. కాగా, పసువు జెండాను గెలిపించాలని లోకేష్‌ కోరడం మినహా ఇక్కడి అభ్యర్థులుగా ఆ ఇరువుర్ని గెలిపించాలని లోకేష్‌ పేరు పెట్టి చెప్పకపోవడం, పుట్టా, పుత్తాల వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. పైగా అటు పుట్టా సుధాకర్‌ వ్యతిరేకిస్తున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలు నారా లోకేష్‌ యువగళంలో ప్రత్యక్షం కావడంతో వారు మరింత ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. చెన్నూరు సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంపులో నారా లోకేష్‌తో వీరశివారెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం కమలాపురం టీడీపీలో అలజడి రేపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement