‘రాత్రి 2 గంటలకు పీఎస్‌కు బీజేపీ నేత ఫోన్‌’ | Sakshi
Sakshi News home page

‘రాత్రి 2 గంటలకు పీఎస్‌కు బీజేపీ నేత ఫోన్‌’

Published Sun, Jun 28 2020 3:33 PM

భోపాల్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి‌ కైలాష్ విజయవర్గియా మరోసారిఇరకాటంలో పడ్డారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారిని ఉత్సాహపరచడానికి చేసిన వ్యాఖ్యలతో ఆయన ట్రోల్‌కు గురవుతున్నారు. ఈ సమావేశంలో కైలాష్‌ మాట్లాడుతూ.. ‘ఓ రోజు రాత్రి 2 గంటలకు మన (బీజేపీ) కార్యకర్త నుంచి ఫోన్‌ వచ్చింది. పేకాట ఆడుతుంటే పోలీసులు అరెస్ట్‌ చేశారు విడిపించండి అని విజ్ఞప్తి చేశాడు. దీంతో వెంటనే సదరు పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి ఆ కార్యకర్తను విడిపించాను. కార్యకర్తల వెన్నంటే బీజేపీ ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కైలాష్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 

ఈ వీడియోను కాంగ్రెస్‌ కమిటీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇదేనా బీజేపీ విధానం? ఇలాంటి ఆలోచనల తోనే మీరు నవభారత్‌ నిర్మించేది? బాధ్యతాయుతమైన మీ నాయకులు పేకాట ఆడి అరెస్టయిన కార్యకర్తను విడిపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. సమాజానికి మీరు ఎలాంటి సందేశాన్ని ఇద్దామనుకుంటున్నారు? మీ కార్యకర్తలకు ఏం చెప్పదల్చుకున్నారు?’ అంటూ నరేంద్ర సలుజా ప్రశ్నించారు. ఇక కైలాష్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇక నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.