Sakshi News home page

అశ్రునయనాలతో చిన్నారి రఫీకి వీడ్కోలు

Published Mon, Aug 4 2014 1:36 AM

Asrunayanalato child raphiki farewell

  • కదిలి వచ్చిన పట్టణ ప్రజలు
  •  రఫీకి నేతల నివాళి
  •  పెడన జామియా మసీదు ప్రాంగణంలో ఖననం
  • పెడన రూరల్ : పట్టణంలో శనివారం జరిగిన పేలుడు దుర్ఘటనలో మృతి చెందిన చిన్నారి మొహమ్మద్ రఫీకి పట్టణ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఆదివారం పెడన జామియా మసీదు ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంతో ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లింలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఆదివారం ఉదయం ప్రభుత్వాసుపత్రిలో బందర్  రూరల్ సీఐ ఎన్‌వీవీఎస్ మూర్తి, పెడన ఎస్సై అల్లు దుర్గా ప్రసాద్ సమక్షంలో పెడన వీఆర్వోలు పంచనామా నిర్వహించారు. అనంతరం బందర్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు వై.అశోక్ పోస్ట్‌మార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తర్వాత ఉరేగింపుగా తీసుకువెళ్లి గుడివాడ రోడ్డులోని జామియా మసీదు ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఖననం చేశారు.
     
    భారీ బందోబస్తు

    రఫీ అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పేలుడు జరిగిన ప్రాంతంతో పాటు బస్టాండ్ సెంటర్‌లో పోలీస్ పికెట్‌లను ఏర్పాటు చేశారు.
     
    ఎమ్మెల్యే కాగిత పరామర్శ
     
    మృతుడు తండ్రి మొహమ్మద్ హనీఫ్‌ను బందరు ప్రభుత్వాస్పత్రిలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఓదార్చారు. పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను బందర్ రూరల్ సీఐను అడిగి తెలుసుకున్నారు. పెడన మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ బెజవాడ నాగరాజు, టీడీపీ నేతలు అయూబ్‌ఖాన్, కరిముల్లా, శోంఠి స్వామి తదితరులు ఉన్నారు.
     
    తరలివచ్చిన నేతలు
     
    పెడన మున్సిపల్ చైర్మన్ యర్రాశేషగిరిరావు, కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వేణుగోపాలరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పెడన మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు బండారు ఆనంద్ ప్రసాద్,  పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నాయకులు అయూబ్‌ఖాన్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు నసీర్‌ఖాన్, జయలక్ష్మి పీఏసీఎస్ మాజీ డెరైక్టర్ అబ్దుల్ అజీజ్  పాల్గొన్నారు.
     
     పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం
     
    పెడన రూరల్ : పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పట్టణంలో దీపావళి టపాసులు తయారు చేసే ఇద్దరు మహిళలను అదుపులో తీసుకుని విచారించారు. దీపావళి టపాసులను తయారు చేసేందుకు తీసుకు వచ్చిన రసాయనాలను వల్ల పేలుడు జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తెలినట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక నిఘా విభాగం ఏడీ ఘటన స్థలానికి చేరుకుని జల్లెడ పట్టారు. కొన్ని ఆధారాలు సేకరించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపినట్లు తెలిసింది.
     

Advertisement

What’s your opinion

Advertisement