Sakshi News home page

రాజ్యాధికారమే లక్ష్యం

Published Sat, Nov 9 2013 1:58 AM

రాజ్యాధికారమే లక్ష్యం

‘బీసీ సమ్మేళనం’లో కుల సంఘాల ప్రతినిధుల పిలుపు
 అధికారంతోనే బీసీల సర్వతోముఖాభివృద్ధి
 బడుగులను అణగదొక్కుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
 డిసెంబర్ 17న నిజాం కళాశాలలో బీసీ సభ

 
రాజ్యాధికారం ద్వారానే బడుగు, బలహీన వర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించగలరని వెనుకబడిన తరగతుల సంఘాల నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బడుగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘రాజ్యాధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ‘బీసీ కులాల సమ్మేళనం’ సదస్సును శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధులతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 
  ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలను రాజకీయ పార్టీలన్నీ ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాయే తప్ప.. వారి సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్ పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా కిరణ్ సర్కారు పట్టించుకోవడం లేదని, 16 బీసీ ఫెడరేషన్లకు పాలకవర్గాలను నియమించలేదని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలూ 150 సీట్లు కేటాయించాలని, పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 50 శాతం నిధులు కేటాయించాలని, ఎస్సీల తరహాలోనే బీసీలకు కూడా 50 శాతం సబ్సిడీతో రూ. 5 నుంచి 15 లక్షల వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ కులాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 17న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కృష్ణయ్య ప్రకటించారు.
 
 స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా బీసీలకు సామాజిక న్యాయం అందలేదని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించిన ప్రభుత్వం.. బీసీ కమిషన్‌పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. న్యాయవ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా రాష్ట్ర హైకోర్టులో అది అమలుకావడం లేదని ఈశ్వరయ్య ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాలని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలు ఐకమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధించగలరని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కులాల వారికీ అసెంబ్లీలో చోటుదక్కాలని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆకాక్షించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే ఎల్.రమణ, బీసీ నేతలు శ్రీనివాసగౌడ్, బొజ్జ కృష్ణయ్య, పలువురు బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
 
 డిసెంబర్ 17న రాజకీయ పార్టీ ప్రకటన?: బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలని బీసీ కుల సంఘాల నేతలు భావిస్తున్నారు. వచ్చే నెల 17న నిజాం కళాశాల మైదానంలో జరిగే బీసీ సభలో కొత్త పార్టీని ప్రకటించాలని వారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణయ్య అధ్యక్షతలో రూపుదాల్చనున్న ఈ పార్టీలో అన్ని బీసీ కులాలకు సమ ప్రాధాన్యం దక్కుతుందని నేతలు చెప్తున్నారు. ఇతర పార్టీల్లోని బీసీ నేతలను తమ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement