Sakshi News home page

నమ్మించి..నిండా ముంచారు

Published Mon, Jan 12 2015 3:49 AM

నమ్మించి..నిండా ముంచారు

మండపేట :రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తానేనని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు నాయుడే.. వాటిని ముప్పుతిప్పల పాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలి సంఘాలను నిండా ముంచారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తామన్న వాగ్దానంతో వారి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక మాట మార్చారు. ఫలితంగా.. సంఘాలకు పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు రాని పరిస్థితి నెలకొంది.  ఈ ఏడాది జిల్లాలో డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.1,316 కోట్ల రుణాలు అందజేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.135 కోట్లు మాత్రమే.
 
 జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు సంబంధించి మెప్మా పరిధిలో 18 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా, డీఆర్‌డీఏ పరిధిలో గ్రామాల్లో 77,819 సంఘాలు ఉన్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా తిరిగి కొత్త రుణాలను తీసుకోవడం సంఘాలకు పరిపాటి. ఈ మేరకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రుణాలు నూరుశాతం లక్ష్యానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 5,581 గ్రూపులకు రూ.143 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా 5,284 గ్రూపులకు రూ.148.37 కోట్లు రుణాలుగా అందజేశారు. అలాగే గ్రామాల్లోని 28,247 గ్రూపులకు రూ.715.11 కోట్ల రుణ లక్ష్యానికి 25,178 గ్రూపులకు రూ.808.61 కోట్లను రుణాలుగా అందజేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది.
 
 చిన్నబోయిన లక్ష్యాలు..
 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తాం, రుణాలు ఎవరూ చెల్లించనవసరంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం ఈ ఏడాది లక్ష్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు హామీని నమ్మిన డ్వాక్రా మహిళలు ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచే రుణాలు చెల్లించడం మానేశారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు.. ‘రుణాలన్నీ రద్దు కాదు.. ఒక్కో సంఘానికి రూ.లక్ష వరకు భారం మాత్రమే తగ్గిస్తా’మంటూ మాట మార్చారు. బాబు హామీని నమ్మి పాత రుణాలు చెల్లించనందున సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త రుణాలు అందని దుస్థితి దాపురించింది.
 
 పట్టణ ప్రాంతాల్లో 7,432 గ్రూపులకు రూ.150 కోట్లు రుణాలుగా అందజేయాలన్నది ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 1,519 గ్రూపులకు రూ.45.63 కోట్లు మాత్రమే రుణాలుగా అందజేశారు. గ్రామాల్లో 36,855 గ్రూపులకు రూ.1,166 కోట్లు రుణాలు అందజేయాల్సి ఉండగా కేవలం 2,882 గ్రూపులకు రూ.90.96 కోట్లు మాత్రమే ఇచ్చారు. నెలల తరబడి రుణాలు చెల్లించక వడ్డీలతో రుణాలు తడిసి మోపెడయ్యాయని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిండా మునిగి పోయామని, అలా కాక గతంలో లాగే ముందు నుంచీ క్రమం తప్పకుండా రుణాలు చెల్లించి ఉంటే కొత్త రుణాలు రావడంతో పాటు వడ్డీ భారం ఉండేది కాదని ఆక్రోశిస్తున్నారు. అంతవరకూ అభివృద్ధిపథంలో పయనిస్తున్న సంఘాల పరిస్థితి.. చంద్రబాబు నమ్మకద్రోహం వల్ల అగాధంలో పడినట్టయిందని నిట్టూరుస్తున్నారు.
 
 కొత్త రుణం దూరం..
 నేను పడమర ఖండ్రిక విఘ్నేశ్వర మహిళా సంఘంలో సభ్యురాలిని. మా సంఘం తరఫున తీసుకున్న రూ.మూడు లక్షల రుణాన్ని తీర్చేసి, కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకూ మంజూరు చేయలేదు. గెలిపిస్తే ఆదుకుంటానన్న చంద్రబాబు గెలిచాన ఒరిగింది లేదు.
 - ఆలపాటి చక్రమ్మ, డ్రాక్రా సంఘం సభ్యురాలు, పడమర ఖండ్రిక
 
 సమయమొచ్చినపుడు సత్తా చూపుతాం
 చంద్రబాబు చేసిన రుణమాఫీ వాగ్దానాన్ని నమ్మి మోసపోయాం. ఇప్పుడు వడ్డీతో సహా రుణాలు చెల్లించాల్సి వస్తోంది. టీడీపీ అధినేత మాట నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. అయితే.. మేమూ సమయం వచ్చినప్పుడు, సత్తా చూపి తగిన రీతిలో బదులిస్తాం.
 - సీహెచ్ సౌభాగ్యవతి, రామచంద్రపురం
 

Advertisement

What’s your opinion

Advertisement