మహా సంకల్పం | Sakshi
Sakshi News home page

మహా సంకల్పం

Published Fri, Sep 27 2013 2:14 AM

District wide communities to protected them targeted

సాక్షి, కడప : జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదాలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. అన్ని వర్గాల వారికి సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యమైంది. లక్షలాది మంది పోరుబాటతో కదం తొక్కుతున్నారు. వినూత్న నిరసనలు, భారీ సభలు, రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు రూపాలు వేరైనా అందరి లక్ష్యం సమైక్యమే. విభజన నిర్ణయంపైమండిపడుతూ, నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా కలిసి రాకుంటే గుణపాఠం తప్పదని కన్నెర్ర చేస్తున్నారు.
 
  కడప నగరంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గోవిందమాంబ భక్తులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు.  ప్రైవేటు వృత్తి కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, వాణిజ్య పన్నులశాఖ, న్యాయవాదులు, న్యాయశాఖ, పంచాయతీరాజ్ ఉద్యోగులు రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు.
 
  రాయచోటి పట్టణంలో రణభేరి పేరుతో ఎన్జీఓలు నిర్వహించిన సభ విజయవంతమైంది. పట్టణం సమైక్య నినాదాలతో హోరెత్తింది. సమైక్యవాదులు భారీ సంఖ్యలో తరలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. వంగపండు ఉష ఆటాపాట సమైక్యవాదుల్లో ఉత్తేజాన్ని నింపింది.
 
  జమ్మలమడుగులోని కొండాపురం మండలంలో వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగులో ఆదర్శ రైతులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎర్రగుంట్ల, ఆర్టీపీపీలో దీక్షలు కొనసాగుతున్నాయి.
 
  బద్వేలులో పౌరవేదిక ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లు  భారీ ర్యాలీ నిర్వహించారు. రిలే దీక్షల్లో పాల్గొన్నారు. గౌతమి.సాయి విద్యార్థులు ర్యాలీ నిర్వహించి 58  సంఖ్య ఆకారంలో నాలుగురోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ, ఉద్యోగ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు రోడ్డుపైనే సూర్యనమస్కారాలు చేశారు.
 
  రాజంపేటలో కూచివారిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంఘీభావం తెలిపారు.
  రైల్వేకోడూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ  నేతలు. కేసీఆర్ చిత్రాలను బ్యానర్‌గా ఏర్పాటు చేసి ఊరేగిస్తూ కుళ్లిన కోడిగుడ్లు, టమోటాలతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో మానవహారంగా ఏర్పడ్డారు. సూరపురాజుపల్లె పంచాయతీకి చెందిన వెయ్యి మంది ప్రజలు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి డప్పు వాయిద్యాల మధ్య డ్యాన్స్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
 
  ప్రొద్దుటూరులో ప్రైవేటు విద్యా సంస్థలు, వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు, మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో 13వ వార్డుకు చెందిన నన్నేసాహెబ్ ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
 
  మైదుకూరులో రైతులు, మహిళలు ఎడ్లబండ్లతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మాధవరాజస్వామి బలిజ సంఘం మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
 
  కమలాపురం పట్టణంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పంచాయతీ కార్యాలయం వద్ద మానవహారంగా ఏర్పడి 58 సంఖ్య ఆకారంలో కూర్చొని ఆందోళన చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పులివెందులలో ఫొటోగ్రాఫర్లు, మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ  నిర్వహించారు. గొర్రెల కాపర్లు రోడ్డు మధ్యలో గొర్రెలను నిలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. 65 మీటర్ల జాతీయ జెండాపై 88 మంది జాతీయ నాయకుల ఫోటోలను ఏర్పాటు చేసి పట్టణంలో ర్యాలీ  నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు రోడ్లు ఊడ్చి ఆందోళన చేశారు.
 

Advertisement
Advertisement