Sakshi News home page

రైసు మిల్లులో అగ్ని ప్రమాదం

Published Wed, Jan 30 2019 7:53 AM

Fire Accident in Rice Mill East Godavari - Sakshi

తూర్పుగోదావరి, కొప్పవరం (అనపర్తి): కొప్పవరం గ్రామ పరిధిలో గల సూర్యశ్రీ రైసు మిల్లులో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. అనపర్తి అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి అధికారి ఏసుబాబు కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం నేలటూరుకు చెందిన నాగరాజు, గంగాధర్, గుమ్మిలేరుకు చెందిన ఫృథ్వీరాజ్, మండపేటకు చెందిన శ్రీనులు సూర్యశ్రీ రైసుమిల్లులో కాంట్రాక్టు పద్ధతిన వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. గోదాము పైభాగంలో పాడైన ఐరన్‌ పైపులకు గంగాధర్, ఫృథ్వీరాజ్‌లు వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తుండగా శ్రీను, నాగరాజులు హెల్పర్స్‌గా వారికి సహాయపడుతున్నారు.

వెల్డింగ్‌ చేస్తున్నప్పుడు నిప్పురవ్వలు కింద ఉన్న తవుడు బస్తాలపై పడడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్క సారిగా మంటలు చెలరేగి, దట్టంగా పొగ వ్యాపించడంతో భీతిల్లిన గంగాధర్, ఫృథ్వీరాజ్‌లు ఏమి చేయాలో తోచని స్థితిలో పై నుంచి మంటల్లోకి దూకారు. ఈ ప్రమాదంలో వీరిరువురికి చర్మం కాలి తీవ్ర గాయాల బారిన పడ్డారు. శ్రీను, నాగరాజులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అనపర్తి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుజేశారు. ఈ ప్రమాదంలో గాయ పడిన నలుగురు వ్యక్తులను అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వీరికి ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం వీరిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు పరామర్శించిన అనపర్తి సీఐ పి.శ్రీనివాస్, ఎస్సై రజనీకుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.

నిర్లక్ష్యమే కారణమా?
రైసు మిల్లులో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పలువురు అంటున్నారు. వెల్డింగ్‌ పనులు నిమిత్తం ఉపయోగిస్తున్న గ్యాస్‌ సిలిండర్‌కు మంటలు వ్యాపించడంతో సిలిండర్‌ కూడా పేలినట్టు తెలుస్తోంది. దీంతో మంటలు మరింత ఉధృతంగా ఎగిసినట్టు సమాచారం. అయితే ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు గాను వినియోగించే అగ్ని నిరోధక సాధనాలు అందుబాటులో లేకపోవడంతో అగ్నిమాపక వాహనం వచ్చే వరకు మంటలు అదుపుజేసే పరిస్థితులు లేక ప్రమాద తీవ్రత పెరిగిందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement