Sakshi News home page

జిల్లాకు మొండిచెయ్యి..!

Published Thu, Jul 17 2014 1:36 AM

Forcing the district ..!

  •  జాతీయ విద్యాసంస్థలు మనకు ఏవి?
  •  ముగ్గురు మంత్రులు ఉన్నా ఫలితం సున్నా
  • విజయవాడ సిటీ :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు మొండిచెయ్యి  చూపారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొల్పే విషయంలో చిన్నచూపు చూశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 11 జాతీయ విద్యాసంస్థలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి మంగళవారం హైదరాబాద్‌లో సమీక్షించి, ప్రతిపాదనలు తయారు చేశారు.

    ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. దానిలో కృష్ణా జిల్లాకు ఒక్క విద్యా సంస్థ ప్రతిపాదన కూడా లేదు. ఎయిమ్స్ విజయవాడలో ఏర్పాటవుతుందని స్వయంగా మంత్రులు ప్రకటించినా అది గుంటూరుకు వెళ్లిపోయింది. గుంటూరులోనే వ్యవసాయ విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ప్రతిపాదించారు.

    విశాఖపట్నంలో ఐఐటీ, ఐఐఎం, గిరిజన విశ్వ విద్యాలయాలు, కర్నూలులో నిట్, ఐఐఎస్‌ఆర్, త్రిపుట్ ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, తిరుపతిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. వీటికోసం భూసేకరణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఒక్క జాతీయ సంస్థను కూడా మంజూరు చేయించలేకపోయారని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
     
    రాజధానిపై ఆశలు ...

    జిల్లాలో రాజధాని ఏర్పాటుపై టీడీపీ నేతలు ఆశలు రేకెత్తిస్తున్నారు. జాతీయ విద్యాసంస్థలు రాకపోయినా, గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు వల్ల జిల్లా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో రియల్టర్లు జిల్లాలో భూములను కొనుగోలు చేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా భూములను కొనుగోలు చేయిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ముమ్మరంగా చేస్తున్నారు.
     

Advertisement

What’s your opinion

Advertisement