‘ట్రాన్స్‌’లోనే బాబు.. ఇలాగైతే కల‘వరం’ | Sakshi
Sakshi News home page

‘ట్రాన్స్‌’లోనే బాబు.. ఇలాగైతే కల‘వరం’

Published Tue, Apr 18 2017 12:02 AM

‘ట్రాన్స్‌’లోనే బాబు.. ఇలాగైతే కల‘వరం’ - Sakshi

పోలవరంపై చంద్రబాబుకు స్పష్టం చేసిన ఉన్నతాధికారులు
- ట్రాన్స్‌ట్రాయ్‌కి పనులు చేసే సత్తా లేదు
సబ్‌ కాంట్రాక్టర్లు పనులను జాప్యం చేస్తున్నారు
48 గేట్లకు గాను పూర్తయింది 3 గేట్లే..
గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదు
సమీక్షా సమావేశంలో అధికారుల పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌..
ఎప్పట్లాగే ట్రాన్స్‌ట్రాయ్‌ను వెనకేసుకొచ్చిన సీఎం
 
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు చేసే సత్తా ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ ట్రాయ్‌కి లేదని సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఆ సంస్థకు కనీసం సరిపడినన్ని మానవ వనరులు కూడా లేవని తెలిపారు. పనులు సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించారని, వారికి బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు పనులు జాప్యం చేస్తున్నాయని వివరించారు. ఇలాగైతే గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు.

సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన సీఎం ఆ తర్వాత ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు పోలవరం పనులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తూ ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ తీరును వివరించారు. వాటిని బాబు పరిగణనలోకి తీసుకోలేదు.పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయన్నారు. పైగా వాస్తవాలు చూడాలంటూ అధికారులకే అక్షింతలు వేసి వారు అవాక్కయేలా చేశారు. పనులు చేసే సత్తా లేని ట్రాన్స్‌ట్రాయ్‌కి  సీఎం నిబంధనలు ఉల్లంఘించి మరీ  వెసులుబాట్లు కల్పిస్తుండటంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. కమీషన్ల కోసమే కాంట్రాక్టు సంస్థని, సబ్‌కాంట్రాక్టు సంస్థలను సీఎం ఇలా రక్షిస్తున్నారని జలవనరుల శాఖలో విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
అధికారుల ఫిర్యాదులివీ..
పోలవరం ప్రాజెక్టు పనులు చేసే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని.. ఆ సంస్థకు సాంకేతిక నిపుణులుగానీ, మానవవనరులుగానీ అం దుబాటులో లేవని జలవనరుల ఉన్నతా ధికారులు సోమవారం నాటి సమీక్షలో సీఎంకు వివరించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ పనులు చేయకుండా సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడాన్ని ఎత్తిచూపారు. ఆ సంస్థలు చేసిన పనులకు ట్రాన్స్‌ట్రాయ్‌ బిల్లులు చెల్లించడం లేదన్నారు. మట్టి పనులు చేస్తోన్న త్రివేణి సంస్థకు రూ.140 కోట్లకుపైగా ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించకపోవడాన్ని ఉదహరించారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు చేస్తోన్న బావర్, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు ట్రాన్స్‌ట్రాయ్‌ బిల్లులు చెల్లించడం లేదన్నారు.

స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు 14.11 లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 32 వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే పూర్తి చేశారని వివరించారు. స్పిల్‌ వే మట్టి పనుల్లో 10.55 కోట్ల క్యూబిక్‌ మీటర్లకుగానూ 6.55 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తి చేశారన్నారు. డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు ఈ ఏడాది ఆగస్టులోగా 667 మీటర్లు పూర్తి చేయాలని.. ఇప్పటివరకూ కేవలం 28 మీటర్లే పూర్తి చేశారని వివరించారు. 48 గేట్లకుగానూ మూడు గేట్లు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని మరో రెండు గేట్ల పనులు ప్రారంభించారని వివరించారు.

పనులు ఇలానే సాగితే పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పాక్షికంగా 2019 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లందించడం అసాధ్యమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్‌కూ సరఫరా చేయని రీతిలో స్టీలు, సిమెంటు ప్రభుత్వమే సరఫరా చేస్తున్నా కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ పూర్తయిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పను లు సంతృప్తికరంగా సాగుతున్నాయన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ చురకలంటిం చడంతో అధికారులు అవాక్కయ్యారు. 
 
సవరించిన అంచనాలు కేంద్రానికి పంపిస్తాం: సీఎం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ప్రాజెక్ట్‌  రేడియల్‌ గేట్ల తయారీ, స్పిల్‌ వే, డయాఫ్రం వాల్‌ పనులను ఆయన పరిశీలించిన తర్వాత ట్రాన్స్‌ట్రాయ్‌ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి ఉమాభారతి 2014 అంచనాల వరకూ డబ్బులు చెల్లిస్తామని చెప్పారని, భూసేకరణ 2013 చట్టం ప్రకారం ఇవ్వాల్సి ఉందని, ప్రాజెక్ట్‌ అంచనాలు కూడా 2010–11 నాటివి ఉన్నాయని, వీటిని సవరించి ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని చెప్పారు. ఈ నెల 24న ప్రాజెక్ట్‌ పురోగతిపై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని, అక్కడ అన్ని విషయాలను వివరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 

Advertisement
Advertisement