దళితుల ముంగిట న్యాయ దేవత | Sakshi
Sakshi News home page

దళితుల ముంగిట న్యాయ దేవత

Published Sun, Feb 2 2014 2:54 AM

Lakshmipeta case trial in special court

లక్ష్మీపేట(వంగర), న్యూస్‌లైన్:లక్ష్మీపేట దళితుల చిరకాల కోరిక నెరవేరింది. తమపై జరిగిన అమానుష దాడి ఘటనపై తమ సమక్షంలోనే విచారణ జరపాలన్న వారి డిమాండ్‌ను మన్నించి సాక్షాత్తు న్యాయదేవతే వారి ముంగిటికి వచ్చింది. ఇక న్యాయ ప్రక్రియ వేగం పుంజుకుంటుందన్న భరోసా కల్పించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన 2012 జూన్ 12నాటి లక్ష్మీపేట దళితుల ఊచకోత కేసు విచారణకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు శనివారం వంగర మండలం లక్ష్మీపేటలో ప్రారంభమైంది. హైకోర్టు పోర్టుఫోలియో జడ్జి ఏవీ శేషసాయి దీన్ని ప్రారంభించారు. కోర్టును ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం కోర్టు లోపలి భాగాన్ని పరిశీలించారు. కోర్టు లోపల విచారణను కూడా పర్యవేక్షించారు.
 
 అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా  న్యాయం ప్రజల ముంగిటికే వస్తోందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం అందరికీ సహజ, సమాన న్యాయం అందజేయడమే న్యాయవ్యవస్థ లక్ష్యమని అన్నారు. చట్ట ప్రకారం లక్ష్మీపేట కేసు విచారణ జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు మంచివారని కితాబిస్తూ.. జిల్లాలో కోర్టుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా జడ్జి డి.ఎస్.భానుమతి మాట్లాడుతూ లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. బాధితులకు ఈ కోర్టు ద్వారా న్యాయం జరుగుతందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 బాధితులకు సకల సౌకర్యాలు:ఏజేసీ
 లక్ష్మీపేట ఘటనను జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుందని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్‌ఎస్ రాజ్‌కుమార్ అన్నారు. బాధితులైన దళితులను ఆదుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఘటనలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు రూ.18.75 లక్షలు, 19 మంది క్షతగాత్రులకు రూ. 22.08 లక్షల నష్టపరిహారం అందించామని చెప్పారు. ఐదు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 88 కుటుంబాలకు అంత్యోదయ అన్నయోజన కార్డులు, మిల్క్‌మిషన్ పథకం కింద పాడిగేదెలు మంజూరు చేశామన్నారు. బాధితులకు పునరావాసం, ఉపాధి హామీ పనుల కల్పన తదితర చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి సతీమణి దుర్గాంబ, లక్ష్మీపేట ప్రత్యేక కోర్టు ఇన్‌చార్జి జడ్జి బి.వెంకటేశ్వరరావు, జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎన్.మలయాద్రి, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు వి.వెంకటరమణ, జిల్లా ఏఎస్పీ బీడీవీ సాగర్, పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్, జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జిలు, బార్ అసోషియేషన్ల ప్రతినిధులు, న్యాయవాదులు. డీఎస్పీ దేవానంద్‌శాంతో, సోషల్ వెల్ఫేర్ డీడీ అచ్చుతానందగుప్త, ఎస్సీ కార్పొరేషన్ ఈఈ జగ్గారావు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, లక్ష్మీపేట బాధితులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement