Sakshi News home page

రూ.10 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే

Published Thu, Jul 13 2017 2:05 PM

రూ.10 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే - Sakshi

హైదరాబాద్‌: సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి విడతగా రూ.10 కోట్లు చెల్లించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి గురువారం ఆ మేరకు నగదును చెల్లించినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కు చెల్లింపు వివరాలను అందజేసినట్లు ఎమ్మెల్యే ఆర్కే వివరించారు. మరో 17 కోట్ల రూపాయలు నిర్ణీత గడువులోగా చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ నెల 17న సదావర్తి భూముల వేలం కేసును హైకోర్టు మరోసారి విచారించనుంది.

అయితే ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని కొంత మంది పెద్దలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.22 కోట్లకు ధారాదత్తం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. అవసరమైతే రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తే మీకే భూములు కేటాయిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అదనంగా చెల్లించాల్సిన రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టుకు నివేదించారు. మొదటి విడత కింద రూ.10 కోట్లను రెండు వారాల్లో చెల్లించాలని, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని కోర్టు స్పష్టం చేయగా... న్యాయస్థానం తీర్పును గౌరవించి ఎమ్మెల్యే ఆర్కే మొదటి విడత నగదును చెల్లించారు.

Advertisement

What’s your opinion

Advertisement