మధ్యాహ్న మె‘నో’ | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న మె‘నో’

Published Sun, Nov 10 2013 3:10 AM

Officials monitoring the error .. Public school students has become a curse

ఉదయగిరి, న్యూస్‌లైన్: అధికారుల పర్యవేక్షణ లోపం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శాపంగా మారింది. సర్కార్ స్కూళ్లల్లో చదివే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించి హాజరు శాతాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే పౌష్టికాహారం విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలింది. పౌష్టికాహార లోపంతో విద్యార్థులు రోగాలబారిన పడుతూ చదువులో వెనకపడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో మెనూ చార్జీలు పెంచినా నాణ్యమైన భోజనం అందడం లేదు.
 
 దీనిని పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు పత్తాలేరు.  జిల్లాలోని 4,052 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 2.4 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను 2,650 ఏజెన్సీలు తీసుకున్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ ఏజెన్సీలకు ఒకటి నుంచి నలుగురు వరకు నెలకు రూ.1000 చొప్పున వేతనం ఇస్తోంది. ఈ ఏజెన్సీలకు ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తుంది. మిగతా కిరాణా సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు కొనుగోలుకు నగదు చెల్లిస్తోంది.
 
 పెరిగిన మెనూ చార్జీలు గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 ఇచ్చేది. ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.4.65 చెల్లించేది. పెరిగిన నిత్యావసర వస్తువులు, కట్టెలు, నూనె, ఉప్పు, ఇతర సామగ్రి ధరలు అధికంగా ఉండటంతో నిర్వాహక ఏజెన్సీలు ఇబ్బందిపడేవి. నాణ్యమైన మెనూ అందించేందుకు పలుమార్లు తమ బాధలను నిర్వాహక ఏజెన్సీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఏడాది మెనూ చార్జీలు పెంచింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఒక్కో విద్యార్థికి రూ.4.35, ప్రాథమికోన్నత స్థాయిలో రూ.6 పెంచింది. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని అధికారులు భావించారు. కాని క్షేత్ర పరిశీలనలో చూస్తే మెనూ మెరుగుపడలేదు. పౌష్టికాహారం అందటం లేదు.
 
 పత్తాలేని పర్యవేక్షణ కమిటీలు
 ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు జరిపేందుకు పౌష్టికాహారం అందించేందుకు ఎంపీడీఓ, ఎంఈఓ, ఈఓపీఆర్‌డీలతో విద్యాశాఖ ఓ కమిటీ వేసింది.
 
 ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజూ ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు కూడా గమనించాల్సి ఉంది. వీరు తాము పరిశీలించిన పాఠశాలల వివరాలను ప్రతి 15 రోజులకోసారి డీఈఓకు పంపాలి. ఈ విధానం జిల్లాలో 90 శాతం అమలుకావడం లేదు. ఎక్కడో అరకొరగా తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పూర్తిస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం కలగానే మిగులుతోంది.
 
 అందించాల్సిన మెనూ
 సోమ, గురువారాల్లో గుడ్డు, సాంబారు (కూరగాయలతో) అందించాలి. మంగళ, శుక్రవారాల్లో పప్పు, కూరగాయలు, బుధ, శనివారాల్లో పప్పు, ఆకుకూరలతో భోజనం పెట్టాలి. కాని చాలాచోట్ల  గుడ్డు  ఇవ్వడం లేదు. అక్కడక్కడ గుడ్డుకు బదులు అరటిపండ్లు ఇస్తున్నారు.
 
 కొన్ని పాఠశాలల్లో మాత్రం ఒక గుడ్డు ఇస్తున్నారు. రిఫైండ్ ఆయిల్‌కు బదులు పామాయిల్ వాడుతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఒక్కో విద్యార్థికి రైస్ వంద గ్రాములు, పప్పు 30 గ్రాములు, కూరగాయలు ఐదు గ్రాములు, ప్రాథమికోన్నత స్థాయిలో రైస్ 150 గ్రాములు, పప్పు 30 గ్రాములు, కూరగాయలు 75 గ్రాములు, నూనె 7.5 గ్రాములు అందించాల్సి ఉంది. కాని చాలాచోట్ల పప్పు అరకొరగానే అందిస్తున్నారు. కూరగాయలు పత్తా కనిపించడం లేదు. గుడ్డుకు బదులు పప్పు, పప్పుకు బదులు రసం అందిస్తుండటంతో పౌష్టికాహారం పూర్తిగా లోపించింది.
 
 నిర్వాహక ఏజెన్సీల ఆవేదన
 ప్రస్తుతం పెరుగుతున్న ధరలకనుగుణంగా మెనూ చార్జీలు ప్రభుత్వం పెంచడం లేదని నిర్వాహక ఏజెన్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పౌష్టికాహారం అందించలేకపోతున్నామంటున్నాయి. కాగా మధ్యాహ్న భోజన పథకానికి జిల్లా అధికారులు ఈ విద్యా సంవత్సరానికి రూ.145 కోట్లు మంజూరు చేశామని చెబుతున్నా ఇంత వరకు ఏజెన్సీలకు చెల్లించలేదు.
 
 ఐదు నెలలుగా బిల్లులు రాలేదు
 ఐదు నెలలుగా బిల్లులు రాలేదు. జీతం కూడా రాలేదు. అప్పుచేసి కొంతవరకు నెట్టుకురాగలిగాం. ప్రస్తుతం దుకాణదారులు  అప్పు ఇవ్వడం లేదు. వీటికితోడు కట్టెల ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా పెరిగాయి. నెలనెలా బిల్లులు సక్రమంగా   ఇస్తే మంచి భోజనం పెట్టే వీలుంటుంది.
 నల్లిపోగు నాగలక్ష్మి,  ఏజెన్సీ నిర్వాహకుడు
 
 మెనూ అమలు చేయని ఏజెన్సీలు రద్దు
 మెనూచార్జీలు పెరిగాయి. మధ్యాహ్న భోజన పథక నిధులు కూడా విడుదల చేశాం. త్వరలోనే ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు అందిస్తాం. మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షణ కమిటీలు తనిఖీలు చేయాలి. అవకతవకలు జరిగితే ఎంఈఓలు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెనూ అమలుపరచని నిర్వాహక ఏజెన్సీలను రద్దుచేసి కొత్త వారికి అప్పగిస్తాం.    మువ్వా రామలింగం,డీఈఓ
 

Advertisement

తప్పక చదవండి

Advertisement