Sakshi News home page

ఉద్యోగం.. నాయకులకే!

Published Thu, Dec 26 2013 2:48 AM

ఉద్యోగం.. నాయకులకే!

రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ యువతకు ఒరిగేదేమీ లేదు  బిల్లులో నిబంధనలు చూసి పెదవి విరుస్తున్న తెలంగాణ ఉద్యోగులు

 సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని యువతకు లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలొస్తాయి’’ - ఇదీ ఇన్నాళ్లుగా చాలామంది రాజకీయ నాయకులు చెప్పిన మాట. కానీ, విభజన బిల్లులో పేర్కొన్న నిబంధనలు చూస్తే, వారి మాటల్లో పసలేదని అర్థమవుతోంది. కొత్త రాష్ట్రంలో రాజకీయ నేతలు మాత్రమే లబ్ధిపొందుతారని, నిరుద్యోగులకు మాత్రం ఒరిగేదేమీ లేదని తెలుస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉద్యోగుల పంపిణీకి సంబంధించి పేర్కొన్న క్లాజులతో తెలంగాణలో యువతకు పెద్దగా సర్కారు కొలువులు వచ్చే పరిస్థితి లేదని తెలంగాణ ఉద్యోగులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎటువంటి మార్పు ఉండదని, రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడే ఉంటారని, ఓపెన్ కేటగిరిలో భర్తీ చేసిన 20 శాతం ఇతర ప్రాంత ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు పంపేలా బిల్లులో క్లాజు లేదని తెలంగాణకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘‘తెలంగాణ జిల్లాల్లో రాష్ట్ర కేడర్ పోస్టులు జిల్లాకు 20 నుంచి 25 వరకు ఉంటాయి. ఆ పోస్టుల్లో తెలంగాణ జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు పనిచేస్తుంటే వారిని మాత్రమే సీమాంధ్ర జిల్లాలకు పంపిస్తారు. అలాగే సీమాంధ్ర జిల్లాల్లోని రాష్ట్ర కేడర్ పోస్టుల్లో తెలంగాణకు చెందిన ఉద్యోగులు పనిచేస్తే వారిని తెలంగాణ జిల్లాలకు పంపిస్తారు. ఇది ఉద్యోగుల పంపిణీ కిందకు రాదు. అక్కడివారు ఇక్కడికి, ఇక్కడివారు అక్కడికి వెళ్తారు. దానివల్ల కొత్తగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఏమీ రావు’’ అని ఆయన వివరించారు.

హైదరాబాద్‌లో పనిచేస్తున్న రాష్ట్ర కేడర్‌కు చెందిన ఉద్యోగుల పంపిణీ మాత్రమే జరుగుతుందని, అయితే వీటికి ఆప్షన్లు ఇస్తామని బిల్లులో పేర్కొన్నందున రాష్ట్ర స్థాయి కేడర్‌లో కూడా తెలంగాణలోని యువతకు పెద్దగా ఉద్యోగాలు రావనే అభిప్రాయం సచివాలయ తెలంగాణ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 1,10,000 మంది పనిచేస్తున్నారు. ఇందులో 70 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉండగా, మరో 21 వేల మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు. 4 వేల మంది విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తుండగా, జీహెచ్‌ఎంసీలో 7,500 మంది, ఇతర ఉద్యోగాల్లో 7,300 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర కేడర్ పోస్టులు సచివాలయంలో 5 వేలు, ఇతర డెరైక్టరేట్లలో మరో 5 వేలు మాత్రమే ఉన్నాయని అధికార వర్గాలు లెక్కతేల్చాయి. ఈ 10 వేల పోస్టులను మాత్రమే జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని బిల్లు క్లాజులో పేర్కొన్నారు.

అయితే సీనియర్లు, భార్య లేదా భర్త ఇరువురూ ఉద్యోగస్తులైతే, కొన్ని రోగాలతో ఆ ఉద్యోగి కుటుంబంలో చికిత్స పొందుతుంటే, అలాంటివారికి ఆప్షన్లు ఇవ్వాలని బిల్లులో ఉంది. సచివాలయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది ఉద్యోగులు సీనియర్లే. వారిలో ఎక్కువమంది హైదరాబాద్‌లో స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వారంతా హైదరాబాద్‌లో పనిచేయడానికే మొ గ్గు చూపుతారనే వాదన సచివాలయ తెలంగాణ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

విభజన తర్వాత ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యాక ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగుల కొరత ఏర్పడితే డిప్యుటేషన్‌పై పక్క రాష్ట్రం నుంచి తీసుకోవాలనే నిబంధనను కూడా బిల్లులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన వల్ల రాజకీయ నేతలు ఇన్ని రోజులు చెప్పినట్లు తెలంగాణలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలేమీ రావని, వస్తే వందల్లో మాత్రమే ఉంటాయని, రాజకీయ నిరుద్యోగులకు మాత్రం పదవులు వస్తాయని తెలంగాణకు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన వల్ల వెంటనే ముఖ్యమంత్రి, మంత్రి పదవులతోపాటు కొన్ని రకాల కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయని, తెలంగాణలోని యువతకు లక్షల్లో సర్కారు కొలువులేమీ రావని సచివాలయ తెలంగాణ ఉద్యోగ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement