Sakshi News home page

పరిహారం చెల్లించకపోతే పీడీ యాక్టు: ప్రత్తిపాటి

Published Fri, Oct 7 2016 6:53 PM

పరిహారం చెల్లించకపోతే పీడీ యాక్టు

అమరావతి: నకిలీ విత్తన కంపెనీలు రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోతే యజమానులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ హాలులో శుక్రవారం నిర్వహించిన 13 జిల్లాల వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైబ్రీడ్ విత్తనాలు అమ్మకం దారులకు ఆర్‌ఎన్‌డీ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కంపెనీలు ఎక్కడ విత్తనాలు వేసి పండించాయో సాక్ష్యం లేకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

విత్తనాలను డిపార్ట్‌మెంట్ పరీక్షించిన తర్వాతే బయటకు రిలీజ్ చేయాలని సూచించారు. తయారుదారీ కంపెనీల బిల్లులు లేకుండా డీలర్లు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 200 బయో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రైవేటుగా ప్రో ఫార్మర్స్ అడ్వకేట్స్‌ను పెట్టుకొని కేసులు పరిష్కరించాలని తెలిపారు. వీటిపై రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ డెరైక్టర్ ధనుంజయరెడ్డిని ఆదేశించారు.

డీలర్‌ను సస్పెండ్ చేస్తే మార్పు రాదని, కంపెనీ యజమానులను బాధ్యులను చేసి అరెస్టు చేయాలని సూచించారు. జీవీ, బ్రహ్మపుత్ర, ఆధార్ వంటి నకిలీ విత్తనాల కంపెనీలపై జేడీలు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలకు సంబంధించి ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. డీడీలు, ఏడీలకు ఆరునెలల పాటు వాహన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల తరువాత మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ఆలోగా ఎన్ని కేసులు పరిష్కరించారు, ప్రగతిని బేరీజు వేస్తానని తెలిపారు.
 

Advertisement

What’s your opinion

Advertisement