Sakshi News home page

వెనుకబడిన కులాలకూ వెన్నుపోటు

Published Tue, Mar 19 2019 8:35 AM

TDP Did Not Give Ticket To BC In Prakasam District - Sakshi

సాక్షి, చీరాల (ప్రకాశం): బీసీలు ఎన్నికల్లో పోటీచేసేందుకు పనికిరారా? టీడీపీ వారిని ఓటు బ్యాంకుగానే చూస్తోందా? జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా అవకాశం కల్పించకపోవడంతో ఆ పార్టీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతపై సర్వత్రా చర్చ నడుస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు హయాంలో బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించి సీట్లు కేటాయించారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబునాయుడు లాగేసుకున్నప్పటి నుంచి పార్టీలో బీసీల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. చివరకు అత్యధికంగా బీసీలు ఉన్న ప్రకాశం జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా బీసీలకు దక్కని దుస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ బీసీలది అని వల్లె వేసే చంద్రబాబు బెత్తెడు చోటు కూడా లేకుండా చేయడంపై ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్టీఆర్‌ హయాంలో జిల్లాకు చెందిన చిమాటా సాంబు, మారుబోయిన మాలకొండయ్య, పాలేటి రామారావు  లాంటి యాదవ సామాజిక వర్గ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారు. పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతికి వచ్చాక యాదవ సామాజికవర్గంపై చిన్నచూపు చూడటం మెదలుపెట్టారు. అందుకు 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క టికెట్‌ కూడా యాదవ సామాజికవర్గానికి కేటాయించకపోవడమే నిదర్శనం.

ఓట్లు కావాలి.. కానీ సీట్లివ్వరా ?
జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 17 లక్షల మంది బీసీలు ఉండగా వారిలో 4 లక్షల మందికి పైగా యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. జిల్లాలో కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల, ఒంగోలు నియోజవర్గాల్లో యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే సామర్థ్యం వారికి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క యాదవ నేతకు కూడా రాజకీయ ప్రాధ్యాన్యత కల్పించకపోవడంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం శ్రమించిన తమను కరివేపాకులా తీసేయడం దారుణమని యాదవ సామాజికవర్గీయులు అంటున్నారు.

బీసీలకు వెన్నుదన్నుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా యాదవులకు అన్ని జిల్లాలో సముచిత స్థానం కల్పించింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రాధాన్యత కల్పించింది. కనిగిరి నియోజకవర్గం నుంచి 2014తో పాటు 2019లో కూడా అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు అవకాశం కల్పించింది. గతంతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థిగా యాదవ సామాజికవర్గానికి చెందిన నూకసాని బాలాజీకి అవకాశం కల్పించింది. కానీ ఆయన టీడీపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరారు.

బీసీలు బాబు వెంట లేరు   
చీరాల అసెంబ్లీ సీటు తమకే ఇవ్వాలని బీసీలు చంద్రబాబును కోరితే.. వారిని హెచ్చరిస్తూ ‘మూడుసార్లు బీసీలకు ఇస్తే మీరు గెలిచారా.. ఓసీలపై బీసీలను నిలబెడితే బీసీలు ఎలా గెలుస్తారు’ అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీసీలు టీడీపీ వైపు లేరని అర్థమవుతోంది. బీసీ డిక్లరేషన్‌ ద్వారా అన్ని కులాలకు న్యాయం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. కనిగిరి సీటును యాదవులకు కేటాయించడం బీసీలపై జగన్‌కు ఉన్న నమ్మకమన్నారు.
– చిమటా సాంబు, మాజీ ఎంపీ

జగన్‌ బీసీ డిక్లరేషన్‌పై నమ్మకముంది
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీలు అభివృద్ధి చెందుతారన్న విశ్వాసం కలుగుతోంది. బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. 139 కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానన్నారు. చిరు వ్యాపారులు, కులవృత్తిదారులకు వడ్డీలేని రుణం ఇస్తామన్న హామీ, రాజకీయ ప్రాతినిధ్యం, నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో సగం కేటాయింపు ద్వారా బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంది. వైఎస్సార్‌లానే ఆయన కొడుకు జగన్‌ కూడా ఇచ్చిన మాట మీద నిలబడతాడని మేము నమ్ముతున్నాం.
 – కేవీఎస్‌ కొండయ్య, బీసీ సంఘం నాయకుడు, గిద్దలూరు

ఆదరణ పేరుతో బీసీలకు బిస్కెట్‌ వేశారు
బీసీ కార్పొరేషన్‌కు తక్కువ నిధులు కేటాయించి అవి కూడా మంజూరు చేయలేదు. సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేటికీ అందించలేదు. కుల వృత్తిదారులకు వస్తువులు పంపిణీ చేస్తున్నామని ఎన్నికల ముందు హడావుడి చేసి 5 శాతం మందికి మాత్రమే ఇచ్చారు. రూ.లక్ష సబ్సిడీ ఇవ్వాల్సిన స్థానంలో రూ.10 వేల వస్తువులు ఇచ్చి ఆదరణ పేరుతో బీసీలకు బిస్కెట్‌ వేసేందుకు ప్రయత్నించారు. బీసీల అభ్యన్నతిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. జిల్లాలో టీడీపీ బీసీలకు ఒక్క ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. 
 – ఎన్‌.రవికుమార్‌యాదవ్, ఎంపీపీ, అర్ధవీడు

Advertisement

What’s your opinion

Advertisement