Sakshi News home page

మంత్రి తోట అనుచరుల వీరంగం

Published Thu, Aug 15 2013 2:27 AM

The Minister of followers Pandemonium

సాక్షి ప్రతినిధి, కాకినాడ : సమైక్యాంధ్ర కోసం వీరవరం సర్పంచ్ తోట వాణి చేస్తోన్న ఆమరణ దీక్షా శిబిరం వద్ద మంత్రి తోట నరసింహం అనుచరులు వీరంగం సృష్టించారు. బుధవారం రాత్రి హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ సంఘటనతో దీక్షా శిబిర సమీప దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. ఆ దారిన పోయే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ మంత్రి అనుచరులు ఆటోలను ధ్వంసం చేసి గలాటా సృష్టించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో ఐదురోజులుగా వాణి దీక్ష చేస్తున్నారు. బుధవారం వాణి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పద్మావతి వచ్చారు.
 
 వాణి బీపీ, సుగర్ పరీక్షలు చేశారు. ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ప్రమాదం.. దీక్ష విరమించుకోవాలని ఆమె సూచించారు. ఐదురోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోకుండా దీక్షను విరమించండి..దీక్షా శిబిరాన్ని ఎత్తివేయాలని చెప్పడమేమిటంటూ డీఎంహెచ్‌ఓపై మంత్రి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి తెగపడ్డారు. ఒక్కసారిగా చుట్టుముట్టి ఆమెపై పేడ, చెత్తను వేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రి అనుచరుల దాడి నుంచి ఆమెను వాహనంలో కార్యాలయానికి తరలించారు. డీఎంహెచ్‌ఓ వెళ్లిపోగానే భానుగుడి సెంటర్లో  పిఠాపురం రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, టౌన్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారి, కొండయ్యపాలెం మిలట్రీరోడ్డులను మంత్రి అనుచరులు దిగ్బంధించి రాస్తారోకో నిర్వహించారు. 
 
 ఆరోడ్డున వెళ్లే పాదచారులను, ద్విచక్రవాహన చోదకులపైనా దాడులకు తెగబడ్డారు. శిబిరం సమీపాన ఉన్న కుర్చీ విసరడంతో బైక్‌పై వెళుతున్న ఒక జంట గాయాలపాలయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మంత్రి అనుచరులు భయానక వాతావరణం సృష్టించి దౌర్జన్యంగా భానుగుడి సెంట ర్లో దుకాణాలను మూయించి వేశారు. దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. షోడాహబ్ నిర్వాహకుడిపై మంత్రి అనుచరులు దాడి చేసి షాపును ధ్వసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు వారిని వారించకుండా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. 
 
 మంత్రి అనుచరులు దాడులతో ప్రశాంతకు మారుపేరుగా నిలిచే కాకినాడ భానుగుడి సెంటర్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి తోట నరసింహం సంఘటనా స్థలానికి చేరుకొని ఇలాంటి అవాం ఛనీయ సంఘటనలు చేయడం సరికాదన్నారు. శాంతియుత పంథాలో దీక్ష చేస్తున్నామని అనుచరులను ఆయన వారించారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement