Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు

Published Thu, Oct 3 2013 2:11 AM

బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు - Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబైంది. అక్టోబర్ 5 నుంచి 13 వరకు నిర్వహించేందుకు  ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ. 3 కోట్లతో ఆలయ పురవీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మించారు. ఆలయ గోపురాలకు రంగులు, విద్యుద్దీపాల అలంకరణలు, నాలుగు మాడ వీధుల్లో రంగవల్లులు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో అన్ని రకాల ఆర్జిత సేవలు,  అడ్వాన్స్ బుకింగ్ నిలిపివేశారు. గురువారం నుంచి 16వ తేదీ వరకు  వికలాంగులు, వృద్ధుల మహా ద్వార ప్రవేశం రద్దు చేశారు.
 
 కల్యాణవేదిక వద్ద పుష్ప, ఫొటో ప్రదర్శన శాలను  ముస్తాబు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. ఏర్పాట్లపై వారు బుధవారం విస్తృతంగా ఇతర అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలకు భద్రతలో భాగంగా మొత్తం 460 సీసీ కెమెరాలు పనిచేయనున్నారుు. ఆక్టోపస్ కమాండోలు, ఏఆర్ కమాండోలు, ఎస్‌పీఎఫ్ సిబ్బం ది, 3వేల మంది పోలీసులు, 156 మంది బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ సురేష్ భగవత్, ఇతర అధికారులు రెండు రోజులుగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
 
 తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
 తిరుమలలో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది.  శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  13 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న కాలిబాట భక్తులకు 5 గంటలుగా దర్శన సమయం నిర్ణయించారు. భక్తుల రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శనం సాయంత్రం వరకు అనుమతించి తరువాత నిలిపివేశారు. గదులకు డిమాండ్ పెరిగింది.
 
 5న తిరుమలకు సీఎం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఈ నెల 5న తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement