‘విమ్స్‌’లో కమీషన్ల దందా! | Sakshi
Sakshi News home page

‘విమ్స్‌’లో కమీషన్ల దందా!

Published Fri, Jun 8 2018 4:19 AM

VIMS privatisation - Sakshi

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాణదాతగా పేరుగాంచిన విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌)ను ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం ప్రైవేట్‌కు అప్పజెప్పారు. రాత్రికి రాత్రే నిబంధనలు మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిం చారు.

ఇప్పటిదాకా రూ.300 కోట్లు వెచ్చించి, అభివృద్ధి చేసిన ఆసుపత్రిని ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టిన తీరు అధికారవర్గాల్లో చర్చనీయాం శంగా మారింది. విమ్స్‌ ప్రైవేటీకరణతోపాటు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రోగులు చికిత్స పొందే ప్రైవేట్‌ ఆస్పత్రులపై అజమాయిషీ కోసం ‘క్లినికల్‌ ఆడిట్‌’ పేరుతో ఓ కాంట్రాక్టు, మాతా శిశుమరణాలు తగ్గించే మరో కాంట్రా క్టును బాగా కావాల్సిన వారికే అప్పగించారు. ఈ కాంట్రాక్టుల అప్పగింత వెనుకరూ.కోట్ల కమీషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గడువుకు ముందే కానిచ్చేశారు
ఎక్కడైనా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తే, బిడ్‌లు దాఖలు చేసుకునేందుకు తగినంత గడువు ఇస్తారు. విమ్స్‌ ప్రైవేటీకరణలో భాగంగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్‌ పిలిచింది. బిడ్‌ల దాఖలుకు జూన్‌ 18వ తేదీ వరకూ గడువు ఇచ్చారు.

కానీ, తమకు బాగా కావాల్సిన బిడ్డర్లు బిడ్‌లు దాఖలు చేయగానే  జూన్‌ 6వ తేదీనే టెండర్‌ ప్రక్రియ ముగించారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) నిబంధనల ప్రకారం ఒకసారి టెండర్‌ పిలిస్తే గడువుకు ముందే ముగించకూడదు. కావాలంటే టెండర్‌ గడువును ఇంకా పొడిగించుకోవచ్చు. అంతేతప్ప గడువుకు ముందే ముగించడం నిబంధనలకు విరుద్ధమే. ఏపీఎంఎస్‌ఐడీసీ నిర్వాకం వల్ల చాలామంది బిడ్‌లు దాఖలు చేయలేకపోయారు.

రాత్రికి రాత్రే ఈఎండీ తగ్గింపు
ఏ టెండర్‌లో అయినా ఎర్నెస్ట్‌ డిపాజిట్‌ మనీ(ఈఎండీ) నిబంధన ఉంటుంది. విమ్స్‌ ప్రైవేటీకరణ టెండర్లలో ఈఎండీ రూ.25 లక్షలుగా నిర్దేశించారు. జూన్‌ 5వ తేదీన ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్‌కు సచివాలయంలోని ముఖ్యకార్యదర్శి పేషీ నుంచి ఈ–మెయిల్‌ వెళ్లినట్లు సమాచారం. రూ.25 లక్షలున్న ఈఎండీని రూ.లక్షకు తగ్గించాలన్నదే ఆ ఈ–మెయిల్‌ సారాంశం.

ముఖ్యమంత్రి కార్యాలయ ఒత్తిళ్ల మేరకే సదరు ఈ–మెయిల్‌ పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు కూడా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు ఫోన్‌ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించినట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ వర్గాలు చెప్పాయి.

సీఎంఓ నుంచి ఆర్డర్‌ ఉందన్నారు
‘‘టెండర్‌ను గడువు కంటే ముందే ముగించిన విషయం వాస్తవమే. ఉన్నతాధికారులు చెప్పినందు వల్లే ఈఎండీని తగ్గించాం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్‌ ఉందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య రాతపూర్వకంగా ప్రతిపాదన పంపిన తర్వాతే చేశాను. దీనిపై నా పాత్ర ఏమీ లేదు’’ – రోహిణి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, ఏపీఎంఎస్‌ఐడీసీ


రూ.కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్‌కు అప్పగిస్తారా?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనల్లోంచి విమ్స్‌ పురుడు పోసుకుంది. దీన్ని హైదరాబాద్‌లోని నిమ్స్‌ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కలలుగన్నారు. విమ్స్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.300 కోట్లు ఖర్చు చేసింది. ఇక్కడ చాలామంది సిబ్బంది పని చేస్తున్నారు. స్పెషలిస్టు డాక్టర్లున్నారు. ఇన్‌సోర్సింగ్‌ కింద వైద్యులు సేవలందిస్తున్నారు. మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ‘విమ్స్‌’ అద్భుతంగా తయారవుతుంది. ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.

అలాంటి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం పెద్దలు తమ స్వార్థం కోసం ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. తాజా నిబంధనల ప్రకారం ఐదు రకాల సేవలను ప్రైవేట్‌కు ఇచ్చేశారు. గుండెజబ్బుల చికిత్సలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు, నియోనెటాలజీ అండ్‌ పీడియాట్రిక్, రీనల్‌ సర్వీసెస్‌ (కిడ్నీ సేవలు), స్పోర్ట్స్‌ ఇంజూరీ (ఎముకల శస్త్రచికిత్సలు, కీళ్ల మార్పిడి) చికిత్సలు ప్రైవేట్‌పరమయ్యాయి. ఈ సేవలను ధనుష్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థకు కట్టబెట్టినట్టు సమాచారం.

సాఫ్ట్‌వేర్‌ సేవలకు సంబంధించిన ఈ సంస్థకు ఆరోగ్య సేవల్లో ఎలాంటి అనుభవం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు అప్పగించారు. తాజాగా విమ్స్‌ కూడా అదే సంస్థ చేతుల్లోకి వెళ్లింది. పైన పేర్కొన్న సేవల్లో ఔట్‌పేషెంట్‌కు, ఇన్‌పేషెంట్‌కు, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, ఎండోస్కొపీ ఇలా ఒక్కొక్క సేవకు ధర నిర్ణయించి ప్రైవేట్‌ సంస్థకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఇదంతా ఏటా రూ.కోట్లలోనే ఉంటుందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక్క ఏడాదిలో ప్రైవేట్‌ సంస్థకు చెల్లించే సొమ్ముతో విమ్స్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయొచ్చని అన్నారు.

Advertisement
Advertisement