Sakshi News home page

నైతిక విలువలకు పట్టం.. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం

Published Thu, Jan 24 2019 3:29 AM

YS Jaganmohan Reddy Doing the Politics with Moral Values  - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, నైతికత వంటి నీతి సూత్రాలను వల్లె వేయడమే గానీ ఆచరణలో వాటికి కట్టుబడి ఉండే రాజకీయ నాయకులు కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ ఆదర్శవంతమైన రాజకీయాలకు చిరునామాగా మారారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ఎవరైనా పార్టీలోకి రావాలంటే.. అప్పటిదాకా అనుభవిస్తున్న పదవులకు రాజీనామా చేశాకే రావాలని జగన్‌ గట్టిగా సూచిస్తున్నారు. అలా పదవులు వదులుకుని వచ్చిన వారినే వైఎస్సార్‌సీపీలో చేర్చుకుంటున్నారు. 

రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు 
ఓ పార్టీ గుర్తుపై గెలుపొంది, మరో పార్టీలోకి ఫిరాయించడం ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. స్వీయ ప్రయోజనాల కోసం, ప్రలోభాలకు లొంగి అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ టికెట్‌పై నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎస్పీవై రెడ్డి ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే చంద్రబాబు పంచన చేరిపోయారు. తరువాత మరో ఇద్దరు ఎంపీలు అదేబాట పట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుట్రతో చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెర లేపారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు నుంచి రూ.40 కోట్లు, ఇతర ప్రయోజనాలను ఎర చూపి వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనేశారు.

సొంత పార్టీలో చేర్చుకున్నారు. కొనుగోలు చేసిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. చంద్రబాబు సాగిస్తున్న అనైతిక, అప్రజాస్వామిక రాజకీయాలపై ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన లెక్కచేయలేదు. ఓవైపు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూనే.. మరోవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ, విలువలు, నైతికత, హుందా రాజకీయాలు అంటూ నీతిపాఠాలు చెప్పడం చంద్రబాబుకే సాధ్యమైంది. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించినపుడు కూడా సంతలో పశువులు కొన్నట్లు కొంటున్నారని చంద్రబాబు గగ్గోలు పెట్టారు. ఏపీలో పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడకుండా జాగ్రత్తపడ్డారు. స్పీకర్‌ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు.  

జగన్‌ తీరుపట్ల ప్రజాస్వామ్యవాదుల హర్షం 
ప్రజాస్వామ్య విలువలకు సాక్షాత్తూ పాలకులే తూట్లు పొడుస్తున్న ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీతికి, నిజాయతీకి, నైతిక విలువలకు, విశ్వసనీయతకే కట్టుబడి ఉన్నారు. 2017లో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నికల సందర్భంగా.. పదవికి రాజీనామా చేయనిదే వైఎస్సార్‌సీపీలో చేరడానికి వీల్లేదని అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డికి షరతు విధించారు. అప్పటికి చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు నెలలు కూడా కాలేదు. ఇంకా దాదాపు ఆరేళ్ల పదవీ కాలం ఉంది. అయినా ఒక పార్టీ తరపున ఎన్నికై మరో పార్టీలో చేరాలంటే అంతకు ముందు సంక్రమించిన పదవి నుంచి కచ్చితంగా నిష్క్రమించాలనే విధానానికే జగన్‌ విలువనిచ్చారు.

వైఎస్సార్‌సీపీలోకి వచ్చే ముందు టీడీపీ తరపున సంక్రమించిన (ఎన్నికైన) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిందేనని చక్రపాణిరెడ్డిని జగన్‌ కోరారు. ఆ ప్రకారమే చక్రపాణిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలేశారు. నంద్యాల బహిరంగ సభా వేదికపైనే తన రాజీనామా లేఖను జగన్‌కు సమర్పించారు. తాజాగా వైఎస్సార్‌ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. టీడీపీ పార్టీతో సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని వీడిన తర్వాతే తమ పార్టీలోకి రావాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆ మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతే వైఎస్సార్‌సీపీలో చేరేందుకు మేడా మల్లికార్జునరెడ్డి సన్నద్ధమవుతున్నారు. అనైతిక రాజకీయాలతో సంఖ్యాబలం పెంచుకోవడం కాదు, నైతిక విలువలకు కట్టుబడి, ప్రజాస్వామ్యం నిలబడాలనే ఉదాత్తమైన ఆశయం కోసం కృషి చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపట్ల ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement